పశువుల మాఫియా
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:49 AM
కుటుంబపోషణ కోసం పశుపోషణ రైతులు, పశువుల వ్యాపారుల వద్ద కూలీలు పనిచేస్తున్న తమను తగరపువలసకు చెందిన శేఖర్ అనే వ్యక్తి నమ్మించి, ఆధార్ కార్డులు తీసుకొని, ఇతర రాష్ట్రాలకు పశువులను అక్రమంగా తరలిస్తున్నాడని పలువరు బాధితులు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పశువుల సంతల్లో కూలీలుగా పనిచేస్తున్న దేవర నాగేశ్వరరావు, కె.దుర్గాప్రసాద్, బర్ల శ్రీను, డి.లక్ష్మణ్, కె.తాతాజీ, రామ్ ప్రసాద్ నేతృత్వంలో పలువురు నక్కపల్లి వచ్చిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
జిల్లా నుంచి కేరళ, తమిళనాడుకు అక్రమ రవాణా
పశువుల సంతల్లో పనిచేసే కూలీల ఆధార్‌కార్డులు దుర్వినియోగం
ఇదేమిటని ప్రశ్నిస్తే.. బెదిరింపులు
మాఫియాపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు
నక్కపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కుటుంబపోషణ కోసం పశుపోషణ రైతులు, పశువుల వ్యాపారుల వద్ద కూలీలు పనిచేస్తున్న తమను తగరపువలసకు చెందిన శేఖర్ అనే వ్యక్తి నమ్మించి, ఆధార్ కార్డులు తీసుకొని, ఇతర రాష్ట్రాలకు పశువులను అక్రమంగా తరలిస్తున్నాడని పలువరు బాధితులు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పశువుల సంతల్లో కూలీలుగా పనిచేస్తున్న దేవర నాగేశ్వరరావు, కె.దుర్గాప్రసాద్, బర్ల శ్రీను, డి.లక్ష్మణ్, కె.తాతాజీ, రామ్ ప్రసాద్ నేతృత్వంలో పలువురు నక్కపల్లి వచ్చిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 150 మంది పలు పశువుల సంతల్లో దాదాపు పదేళ్ల నుంచి కూలీలుగా పనిచేస్తున్నారు. సంతల్లో రైతులు కొనుగోలు చేసిన పశువులను వాహనాల్లోకి ఎక్కించి సదరు రైతుల గ్రామాలకు తీసుకెళ్లి అప్పగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తగరపువలసకు చెందిన శేఖర్ అనే వ్యక్తి వీరితో పరిచయం పెంచుకున్నాడు. ఇతను కొత్తవలస, పెదమానాపురంతోపాటు ఒడిశాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి, ఇతర ప్రాంతాలకు తరలించమని వీరికి చెప్పేవాడు. ఇందుకు నిర్ణీత మొత్తాన్ని కూలి రూపంలో తీసుకొనేవారు. ఈ క్రమంలో వీరి ఆధార్ కార్డులను తీసుకొన్నాడు. వీటిని అడ్డంపెట్టుకొని భారీ ఎత్తున పశువులను కొనుగోలు చేస్తూ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కబేళాలకు తరలిస్తున్నాడు. కొంతకాలం తరువాత ఈ విషయం తెలుసుకొని, అతని వద్ద పని మానేశారు. తరువాత ఒక సంతలో పశువులను కొనుగోలు చేసి, మరో సంతలో మారుబేరానికి విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. దీంతో కక్షగట్టిన శేఖర్.. వీరు పశువులను రవాణా చేసే వాహనాలను తన అనుచరులతో అడ్డుకొనేవాడు. తనకు ఒక్కో వాహనానికి రూ.7-9 వేలు ఇవ్వాలని, లేకపోతే పోలీసులకు పట్టిస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తూ, పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న శేఖర్, అతని ముఠాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలను డీఎస్పీకి, సీఐకి అందజేశారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.