Share News

గోవుల మృత్యువాత

ABN , Publish Date - Apr 22 , 2026 | 12:57 AM

ఆలనాపాలనా లేకపోవడంతో కొత్త వెంకోజీపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం సమీపానున్న గోశాలలో ఆవులు ఒక్కొక్కటి మృతిచెందుతున్నాయి.

గోవుల మృత్యువాత

రోజుల తరబడి అలాగే వదిలేస్తున్న గోశాల నిర్వాహకులు

దుర్గంధం వెదజల్లుతుండడంతో పరిసర ప్రాంతాల వాసుల ఆందోళన

వెంకోజీపాలెం, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):

ఆలనాపాలనా లేకపోవడంతో కొత్త వెంకోజీపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం సమీపానున్న గోశాలలో ఆవులు ఒక్కొక్కటి మృతిచెందుతున్నాయి. కనీసం చనిపోయిన ఆవులను అక్కడి నుంచి తీసేవారు కూడా లేరు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. పది రోజుల కిందట ఒక గోవు చనిపోతే, అక్కడే వదిలేశారు. మంగళవారం ఒక దూడ మృతిచెందింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ విషయాన్ని గ్రామ సేవా సంఘం ప్రతినిధులకు తెలియజేశారు. సంఘం సభ్యులు గోశాలను పరిశీలించగా పది రోజుల క్రితం చనిపోయిన గోవు కనిపించింది. సరైన ఆహారం లేక చనిపోయిన గోవులను నిర్వాహకులు అక్కడే ఖననం చేస్తున్నారని, వాటి ఎముకలను వేరే అవసరాలకు వినియోగిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన గోవును నిర్వాహకులు అక్కడే ఖననం చేయడానికి యత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. నిరంతరం దాతల నుంచి డబ్బులు తీసుకోవడమే గానీ గోశాల నిర్వాహకులు వాటి పోషణను పట్టించుకోవడం లేదని, అందుకే అవి చనిపోతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గోవులు చనిపోయినా అలాగే వదిలేస్తే పరిసర ప్రాంతాల ప్రజలు రోగాలబారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే గోవులను సంరక్షణ కేంద్రాలకు పంపించాలని గ్రామ సేవా సంఘం అధ్యక్షులు ఆడారి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పీల ప్రేమ్‌కిరణ్‌ జగదీష్‌, తదితరులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 12:57 AM