జీడిపిక్కల ధర పతనం
ABN , Publish Date - May 04 , 2026 | 12:55 AM
జీడి పిక్కల దిగుబడి బాగా తగ్గిపోయి తీవ్రనిరాశతో వున్న రైతులు.. ఇప్పుడు పిక్కల ధర తగ్గడంతో మరింత దిగులు చెందుతున్నారు. సుమారు నెలన్నర క్రితం బస్తా జీడిపిక్కల (80 కిలోలు) ధర రూ.13 వేల వరకు వుండగా, ఇప్పుడు పది రూపాయలకు పడిపోయింది.
80 కిలోల బస్తాపై రూ.3 వేల వరకు తగ్గుదల
మార్చిలో రూ.13 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు
ఇప్పుడు రూ.10 వేలకు పడిపోయిన ధరల
వ్యాపారులు సిండికేట్ అయ్యారని రైతుల ఆరోపణ
రావికమతం, మే 3 (ఆంధ్రజ్యోతి): జీడి పిక్కల దిగుబడి బాగా తగ్గిపోయి తీవ్రనిరాశతో వున్న రైతులు.. ఇప్పుడు పిక్కల ధర తగ్గడంతో మరింత దిగులు చెందుతున్నారు. సుమారు నెలన్నర క్రితం బస్తా జీడిపిక్కల (80 కిలోలు) ధర రూ.13 వేల వరకు వుండగా, ఇప్పుడు పది రూపాయలకు పడిపోయింది.
జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో జీడిమామిడి తోటలు వున్నాయి. ఒకప్పుడు వరి, చెరకు సాగు చేసిన భూముల్లో సైతం ఇప్పుడు జీడిమామిడి సాగు చేస్తున్నారు. ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఈ తోటలు వున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో పూత ఆశాజనకంగానే వచ్చినప్పటికీ పిందె వచ్చే సమయంలో తేనే మంచు ప్రభావంతో టీ దోమ ఉధృతి పెరిగి చాలా వరకు పూత మాడిపోయింది. దీంతో ఆశించిన దిగుబడి రాలేదు. మొదటి విడత కాపునకు సంబంధించి మార్చి నెలలో దిగుబడిరాగా.. వ్యాపారులు కిలో రూ.160 చొప్పున బస్తా (సుమారు 80 కిలోలు) జీడి పిక్కలను రూ.13 వేలకు కొనుగోలు చేశారు. దిగుబడి తగ్గినప్పటికీ.. ధర ఒకింత ఆశాజనకంగా వుండడంతో రైతులు ఊరట చెందారు. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలతో రెండవ దఫా వచ్చిన పూతకు సంబంధించిన కాపు బాగుంది. దిగుబడి కూడా పెరిగింది. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించేశారు. ప్రస్తుం కిలో రూ.130 ధరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో బస్తాకు సుమారు మూడు వేల రూపాయలు తగ్గిపోయాయి. ప్రస్తుతం నాణ్యమైన పిక్కల దిగుబడి వస్తున్నదని, ధర పెంచకపోగా తగ్గించడం ఏమిటని వ్యాపారులను అడిగితే.. పెద్ద మార్కెట్‌లలోనే ధర తగ్గిపోయిందని, రానున్న రోజుల్లో మరింత తగ్గవచ్చని అంటున్నారని రైతులు వాపోయారు