బియ్యానికి బదులు నగదు?
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:38 AM
జిల్లాలో బియ్యం కార్డుదారులకు బియ్యానికి బదులు నగదు చెల్లింపు ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది.
ప్రతిపాదనపై కసరత్తు
ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లాలో అమలు
బియ్యం కార్డుదారులు
15వ తేదీలోగా ఆధార్ నంబర్‌తో మొబైల్ నంబరు అనుసంధానం చేసుకోవాలని అధికారుల సూచన
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో బియ్యం కార్డుదారులకు బియ్యానికి బదులు నగదు చెల్లింపు ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖపట్నంతోపాటు మరికొన్ని నగరాల్లో అమలు కానున్నది. ప్రజలకు ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది.
జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.17 లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా సుమారు ఎనిమిది వేల టన్నుల బియ్యం కార్డుదారులకు సరఫరా చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతం కంటే నగరంలో 80 శాతం మంది కార్డుదారులు బియ్యాన్ని విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. దీనికి బదులు కార్డుదారుల ఖాతాకు సొమ్ములు జమ చేస్తే వారికి ఇష్టమైన సరుకులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే కేంద్రం పలు పథకాలకు సంబంధించి నగదు బదిలీ విధానం అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానానికి కార్డుదారులు సహకరిస్తారా?, లేదా?...అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే సీబీడీసీ విధానం అమలుకు సంబంధించి సాంకేతికంగా అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ విధానం అమలు చేయాలంటే ప్రతి కార్డుదారుడు తన ఆధార్ నంబరును మొబైల్ నంబరుకు అనుసంధానం చేయాల్సి ఉంది. బియ్యం కార్డుదారులు తమ పరిధిలో సచివాలయాలు, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, గ్రామీణ ప్రాంతంలో అయితే తహశీల్దారు కార్యాలయానికి వెళితే ఆధార్ నంబరుకు మొబైల్ నంబరును అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.భాస్కర్ తెలిపారు. ఆధార్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం చేసే ముందు బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా ఉన్నాయా?, లేదా?...అనేది ముందుగా పరిశీలించుకోవాలని సూచించారు. ఒకవేళ ఇబ్బంది ఉంటే సంబంధిత బ్యాంకును సంప్రతించాలని కోరారు. బ్యాంకు వివరాలు పక్కాగా ఉంటేనే నగదు బదిలీ సక్రమంగా జరుగుతుందని అన్నారు.
నేడు గాజువాకలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):
గాజువాకలో రూ.9.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. గొంతినవానిపాలెం, వినాయక నగర్, వుడా కాలనీ వాసులకు ఇది ఉపయోగపడుతుంది. వీఎంఆర్‌డీఏ బోర్డు సమావేశంలో గురువారం ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే శంకుస్థాపనకు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి గాజువాక కూటమి నాయకులంతా హాజరు కావాలని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కోరారు.
జనసేన అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా పంచకర్ల
సమన్వయకర్తలుగా పంచకర్ల సందీప్, అంగ దుర్గా ప్రశాంతి, మైలపల్లి నాగలక్ష్మి
కేంద్ర కమిటీ సభ్యునిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అడ్‌హాక్ కమిటీలను నియమించింది. దీనికి విశాఖ పార్లమెంటు నియోజకవర్గ కమిటీ కన్వీనర్‌గా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు వ్యవహరిస్తారు. కమిటీలో ఎమ్మెల్యేతో పాటు భీమిలి ఇన్‌చార్జి పంచకర్ల సందీప్, అంగ దుర్గా ప్రశాంతి, మైలపల్లి నాగలక్ష్మిలు సమన్వయకర్తలుగా ఉంటారు. మరో 32 మందిని నిర్వాహక దళ్‌గా, ఇంకో ఐదుగురిని సహాయక బృందంగా నియమించింది. వీరంతా క్షేత్రస్థాయిలో సమచారం సేకరించి కేంద్ర కమిటీ సూచనల ప్రకారం పనిచేస్తారు. ఇదిలావుండగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు.
‘మహా మాయాజాలం’పై జీవీఎంసీలో ప్రకంపనలు
ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగం అధికారులపై కమిషనర్ ఆగ్రహం
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తోపాటు బాధ్యులపై చర్యలకు ఆదేశం
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజోతి):
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో టెండరు డాక్యుమెంట్‌లను మార్ఫింగ్ చేసి అధికమొత్తం బిల్లులు డ్రా చేస్తున్న వైనంపై ‘మహా మాయాజాలం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనం అధికారవర్గాలతోపాటు కాంట్రాక్టర్లలో ప్రకంపనలు సృష్టించింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి బినామీ పేర్లతో పనులు దక్కించుకుని, బిల్లులు పెట్టినప్పుడు టెండరు వేసినప్పుడు కోడ్ చేసిన లెస్‌ల శాతాన్ని మార్ఫింగ్ చేసి ఎక్కువ మొత్తం డ్రా చేస్తుండడంపై కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై జీవీఎంసీ కమిసనర్ కేతన్‌గార్గ్ స్పందించారు. బాధ్యుడైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌తోపాటు అతనికి సహకరించిన డ్రాయింగ్ బ్రాంచ్ (డీబీ), వర్క్ ఇన్‌స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్‌లపై చర్య తీసుకోవాలని ఇంజనీరింగ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అదేవిధంగా సదరు డీఈ ఇంతవరకు అలా ఎన్ని పనులు చేసి మార్ఫింగ్ ద్వారా ఎంత మొత్తం అధికంగా జీవీఎంసీ నుంచి డ్రా చేశారనేది గుర్తించి రికవరీ చేయాలని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్‌లతోపాటు అకౌంట్స్ విభాగంలోని అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో సదరు డీఈకి బినామీలుగా వర్కులు ఇచ్చిన కాంట్రాక్టర్లతోపాటు మార్ఫింగ్ పత్రాలతో అధికంగా బిల్లు పొందేందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఏ క్షణంలో తమపై సస్పెన్షన్ వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నట్టు ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు.
ఎంఈవోల చేతివాటంపై విచారణ
మరోవైపు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమగ్ర శిక్ష ఏపీసీ వీడియో కాన్ఫరెన్స్
విద్యామిత్ర కిట్ల రవాణా చార్జీల చెల్లింపుపై ఆరా
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):
విద్యామిత్ర కిట్ల రవాణాకు సంబంధించిన చార్జీలు ప్రధానోపాధ్యాయులకు పలు మండలాల్లో విద్యా శాఖాధికారులు చెల్లించని వైనంపై సమగ్ర శిక్ష అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కణిత ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన విచారణకు గాజువాక మండలంలో 46 ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. విద్యా మిత్ర కిట్ల రవాణాకు సమగ్ర శిక్ష అధికారులు ఈ ఏడాది జూన్ మూడో వారంలో మండల విద్యాశాఖాధికారుల ఖాతాలకు సొమ్ములు జమ చేశారు. అయినా గాజువాక ఎంఈవో ఇంతవరకూ సొమ్ములు సంబంధిత హెచ్‌ఎంలకు ఇవ్వలేదని నోబుల్ టీచర్ల సంఘం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు విచారణ నిర్వహించారు. అయితే విచారణకు పలువురు ఇతర సంఘాల నేతలు కూడా హాజరై అధికారుల ముందు హడావిడి చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఇతర సంఘాలకు చెందిన నాయకులు గాజువాక ఎంఈవోకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. విచారణకు హెచ్‌ఎంలు మాత్రమే రావల్సి ఉండగా, సంఘాల నేతలు ఎందుకు వచ్చారని పలువురు టీచర్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్వేచ్ఛగా విచారణ చేపట్టేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని టీచర్లు కోరుతున్నారు. ఇదిలావుండగా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జె.చంద్రశేఖరరావు శుక్రవారం జిల్లాలో హెచ్‌ఎంలు, ఎంఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యామిత్ర కిట్ల్లకు రవాణా సొమ్ములు సంబంధిత ఎంఈవోలు ఇచ్చారా? లేదా అనేది రాతపూర్వకంగా లేదా మెయిల్, వాట్సాప్, సీల్డు కవర్ ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో మరికొందరు ఎంఈవోలు కూడా సొమ్ములు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
చెత్తను రోడ్డుపై పడేస్తున్న 58 దుకాణాలు సీజ్
రూ.4.36 లక్షలు జరిమానా
విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్యానికి విఘాతం (చెత్తను రోడ్లపై పడేయడం) కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణాలపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం నగరవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేస్తున్న 58 దుకాణాలను సీజ్ చేసి, రూ.4.36 లక్షలు జరిమానా విధించారు. భీమిలి జోన్‌లో రెండు దుకాణాలను సీజ్ చేసి రూ.40 వేలు జరిమానా విధించారు. మధురవాడ జోన్‌లో 16 దుకాణాలు సీజ్ చేసి రూ.94 వేలు, ఈస్ట్‌జోన్ పరిధిలో 14 దుకాణాలను సీజ్ చేసి రూ.43 వేలు, నార్త్‌జోన్ పరిధిలో ఎనిమిది దుకాణాలను సీజ్ చేసి రూ.55,500 జరిమానా విధించారు. అదేవిధంగా సౌత్ జోన్ పరిధిలో రెండు దుకాణాలను సీజ్ చేసి రూ.58,500, వెస్ట్ జోన్ పరిధిలో ఐదు దుకాణాలను సీజ్ చేసి రూ.37,500, అగనంపూడి జోన్‌లో ఒక దుకాణం సీజ్ చేసి రూ.15 వేలు, అనకాపల్లి జోన్‌లో నాలుగు దుకాణాలు సీజ్ చేసి రూ.22,500 జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తరువాత తిరిగి దుకాణం తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. చెత్త వేసేందుకు డస్ట్‌బిన్‌లు ఏర్పాటుచేయకపోవడంతో మరో 22 దుకాణాల నిర్వాహకులకు కూడా జరిమానాలు విధించారు. నగరంలో చెత్తను రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు. ఆయన స్వయంగా అల్లిపురంలోని ఒక దుకాణాన్ని సీజ్ చేసి రూ.25 వేలు జరిమానా విధించారు.