42 ప్రైవేటు బస్సులపై కేసులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:58 AM
అధిక చార్జీలు వసూలుచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు.
రవాణా శాఖ అధికారుల తనిఖీలు
అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్టు గుర్తింపు
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
అధిక చార్జీలు వసూలుచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపించారు. ప్రయాణికులను ట్రావెల్స్ నిర్వాహకులు దోచుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రవాణా శాఖ ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఆర్‌టీజీఎస్ పర్యవేక్షణతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫేర్ మానటరింగ్ టీమ్స్ ద్వారా అన్ని టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారాల (అభిబస్, రెడ్‌బస్, బుక్‌మైట్రిప్ వంటి యాప్‌ల)పై నిరంతర నిఘా పెడుతున్నారు. అధిక ధరలను వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత ప్రైవేటు బస్సు యజమానులతో మాట్లాడి చార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికీ టికెట్ ధరలను తగ్గించని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా గతరెండు రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో అధికచార్జీలు వసూలుచేసిన ఒక బస్సుతోపాటు టాక్స్, పర్మిట్ లేకుండా తిరుగుతున్న మరో బస్సును సీజ్ చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఇవికాకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్టు గుర్తించి 42 ప్రైవేటు బస్సులపై కేసులు నమోదుచేసి రూ.7.22 లక్షలు జరిమానా విధించామన్నారు. ఎవరైనా అధిక చార్జీలు వసూలు చేసినా, పర్మిట్ లేకుండా బస్సులను తిప్పుతున్నాసరే నిరంతర హెల్ప్‌లైన్ నంబర్ 9281607001కి సమాచారం అందించాలని ఆయన కోరారు.