Share News

వేగ పరిమితి దాటితే కేసులు

ABN , Publish Date - Apr 02 , 2026 | 01:30 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనాల వేగం నిర్దేశించిన పరిమితి దాటితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. వాహనాలను అపరిమిత వేగంతో నడపడం వల్లనే రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు.

వేగ పరిమితి దాటితే కేసులు

రూ.వెయ్యి జరిమానాతో కూడిన చలాన్‌ జారీ

ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌

నగర పరిధిలోని అన్ని మునిసిపల్‌ రోడ్లపైనా, బీచ్‌రోడ్డులో 40 కిలోమీటర్లు

శివార్లలో 50 కిలోమీటర్లు..

విశాఖపట్నం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి):

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనాల వేగం నిర్దేశించిన పరిమితి దాటితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్‌ ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. వాహనాలను అపరిమిత వేగంతో నడపడం వల్లనే రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు సీపీ శంఖబ్రతబాగ్చి మూడు లేజర్‌గన్‌లను ట్రాఫిక్‌ పోలీసులకు అందజేశారన్నారు. నగరంలో ఈ-మర్రిపాలెం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌ వరకు 50 కిలోమీటర్లు, అగనంపూడి నుంచి కొమ్మాది వరకు 40, కొమ్మాది నుంచి రాజాపులోవ వరకు 50 కిలోమీటర్లు, రాజాపులోవ నుంచి పెందుర్తి సమీపంలోని పినగాడి జంక్షన్‌ వరకు జాతీయ రహదారిపై 60 కిలోమీటర్లు, పెందుర్తి నుంచి గోపాలపట్నం బాజీ జంక్షన్‌ వరకు 50, బాజీ జంక్షన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు 40, బీచ్‌రోడ్డులో కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు, నగర పరిధిలోని అన్ని మునిసిపల్‌ రోడ్లపైనా 40 కిలోమీటర్లు, కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి షీలానగర్‌ వరకు 50 కిలోమీటర్లు గరిష్ఠ వేగపరిమితి నిర్ణయించామన్నారు. గరిష్ఠ వేగపరిమితిని ఎవరైనా మించినట్టయితే లేజర్‌ గన్స్‌ ద్వారా వాహనాల ఫొటోలు తీయడం జరుగుతుందని, వాటి వివరాలతో యజమానికి రూ.వెయ్యి జరిమానాతో కూడిన చలాన్‌ జారీ అయిపోతుందన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే వాహనాల వేగానికి కళ్లెం వేయడం ఒక్కటే మార్గమన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ ఏసీపీ వాసుదేవ్‌, ట్రాఫిక్‌ సీఐ ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2026 | 01:30 AM