Share News

16 బస్సులపై కేసులు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:55 AM

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ఉల్లంఘనలకు గుర్తించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తున్నట్టు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

16 బస్సులపై కేసులు

ట్రావెల్స్‌పై రవాణా శాఖ స్పెషల్‌డ్రైవ్‌

విశాఖపట్నం, మార్చి 31 (ఆంఽధ్రజ్యోతి):

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో ఉల్లంఘనలకు గుర్తించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ను కొనసాగిస్తున్నట్టు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోకి వచ్చి, వెళ్లే ట్రావెల్స్‌ బస్సులను అగనంపూడి, ఆనందపురం టోల్‌గేట్‌ల వద్ద ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయన్నారు. ట్రావెల్స్‌ బస్సులు వరుస ప్రమాదాల నేపథ్యంలో పక్కాగా నిబంధనలు పాటించడంతోపాటు అన్ని అనుమతులు కలిగివుండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత పది రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్‌ నిబంధనలు ఉల్లంఘించడం, ఎమర్జన్సీ డోర్స్‌ పనిచేయకుండా సీట్లతో మూసేయడం, ఎంవీ యాక్ట్‌ను ఉల్లంఘించడం వంటి అభియోగాలపై 16 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. వాటి నుంచి రూ.6.94 లక్షలు అపరాధరుసుం వసూలు చేశామన్నారు. ఇకపై కూడా ట్రావెల్స్‌పై స్పెషల్‌డ్రైవ్‌ కొనసాగుతుందని డీటీసీ తెలిపారు.


అదుపుతప్పిన కారు... ఐదుగురికి గాయాలు

విజయనగరం క్రైం/భీమిలి రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వెళుతున్న ఓ కారు మంగళవారం రాత్రి 10.30 గంటలకు దాకమర్రి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కునేటి మహేశ్‌, తాలాడ అప్పన్న, తాలాడ ఆదిబాబు సహా మరో ముగ్గురు ఉన్నారు. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.


రాగులు సరఫరా లేనట్టే...

విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

బియ్యం కార్డుదారులకు ఏప్రిల్‌ నెలలో కూడా రాగులు సరఫరా చేయడం లేదు. రాగుల నిల్వ లేనందున జిల్లాలో డీలర్లకు పంపిణీ జరగలేదు. ఈ ఏడాది రెండు నెలలు మాత్రమే కార్డుదారులకు రాగులు పంపణీ చేశారు. కాగా బుధవారం నుంచి కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి అందజేస్తామని పౌరసరఫరాల అధికారులు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 12:55 AM