Share News

కారు జోరు

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:03 AM

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో దసరా జోష్‌ కనిపిస్తోంది. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈసారి 10 నుంచి 30 శాతం మేర విక్రయాలు పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు దసరా రోజు డెలివరీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే పండుగకు కొద్దిరోజుల ముందు నుంచి కార్లు, టూ వీలర్ల బుకింగ్స్‌ ఊపందుకుంటాయి. ఈ ఏడాది కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు షోరూమ్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

కారు జోరు

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో దసరా జోష్‌

గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన కార్లు, టూ వీలర్ల అమ్మకాలు

రోజుకు 20 కార్ల వరకూ బుక్‌ అవుతున్నట్టు చెబుతున్న డీలర్లు

మూడు రెట్లు మేర పెరిగిన టూ వీలర్ల విక్రయాలు

ఎలక్ర్టిక్‌ వాహనాలకు డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో దసరా జోష్‌ కనిపిస్తోంది. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈసారి 10 నుంచి 30 శాతం మేర విక్రయాలు పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు దసరా రోజు డెలివరీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే పండుగకు కొద్దిరోజుల ముందు నుంచి కార్లు, టూ వీలర్ల బుకింగ్స్‌ ఊపందుకుంటాయి. ఈ ఏడాది కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు షోరూమ్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

సాధారణ రోజుల్లో రోజుకు ఒక్కో షోరూమ్‌లో ఐదు కార్ల వరకూ బుకింగ్స్‌ జరుగుతుంటాయి. పండగ నేపథ్యంలో గడిచిన రెండు వారాలుగా ప్రతిరోజూ 10 నుంచి 20 వరకు బుకింగ్స్‌ అవుతున్నట్టు చెబుతున్నారు. గడిచిన ఏడాది దసరాకు వరుణ్‌ మారుతీ కంపెనీ సుమారు 500 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 650 నుంచి 700 వరకూ అయ్యే అవకాశం ఉందని కంపెనీ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.నవీన్‌కుమార్‌ తెలిపారు. సాధారణంగా ప్రతినెలా 400 నుంచి 430 వరకు వాహనాలు విక్రయాలు సాగితే, దసరా పండగ నేపథ్యంలో అక్టోబరు నెలలో 30 శాతం మేర అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. నగర పరిధిలోని ఇతర షోరూమ్‌లలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉన్నాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు వచ్చేవారితో షోరూమ్‌లు కూడా కళకళలాడుతున్నాయి. ఇదిలావుండగా పండగ స్పెషల్‌ ఆఫర్‌ పేరుతో మోడల్‌ను బట్టి రూ.50 వేల నుంచి రూ.1.9 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు డీలర్లు చెబుతున్నారు.

ఈ కార్లకు ఎక్కువ డిమాండ్‌..

ప్రతిరోజూ షోరూమ్‌కు 30 నుంచి 50 మంది వరకూ ఎంక్వయిరీలకు వస్తున్నారని, వారిలో దాదాపు 20 నుంచి 30 మంది వరకు బుక్‌ చేసుకుంటున్నారని పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు ఉంటున్నట్టు చెబుతున్నారు. ఇకపోతే, ఎక్కువగా డిమాండ్‌ ఉన్న కార్ల జాబితాలో మారుతి స్విఫ్ట్‌, డిజైర్‌, వేగనార్‌, బ్రెజా, టాటా పంచ్‌, నెక్సాన్‌, ఆల్ర్టోజ్‌, హ్యుండయ్‌ కంపెనీకి చెందిన క్రెటా, వెన్యూ, మహీంద్రా థార్‌ వంటివి ఉన్నాయి. వీటిలో కొన్నింటిని డిమాండ్‌కు అనుగుణంగా అందించలేని పరిస్థితి ఉండడంతో కొనుగోలుదారులు దసరా తరువాత వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

జోరుగా టూ వీలర్ల అమ్మకాలు

టూ వీలర్ల అమ్మకాలు కూడా భారీసంఖ్యలో సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో నెలకు ఒక షోరూమ్‌ నుంచి 1,500 వరకు అయితే, దసరా పండగ నేపథ్యంలో ప్రస్తుతం ఐదు వేల వరకు విక్రయించే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 20 నుంచి 40 శాతం వరకు ఎలక్ర్టిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంతో పోలిస్తే ఎలక్ర్టిక్‌ టూ వీలర్ల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, దీంతో డిమాండ్‌కు అనుగుణంగా అందించలేని పరిస్థితి ఏర్పడుతోందని పలువురు షోరూమ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. టూ వీలర్లపై ఐదు వేల నుంచి రూ.20 వేల వరకూ ఆఫర్లను ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. టూ వీలర్ల అమ్మకాల్లో కొంత వేగం కనిపిస్తోందని వరుణ్‌ బజాజ్‌ సీఈవో ఎ.శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈవీలకు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారని, వాటి అమ్మకాలు భారీగా పెరిగినట్టు ఆయన తెలిపారు.

Updated Date - Oct 16 , 2026 | 01:03 AM