Share News

కోలాహలంగా కార్నివాల్‌

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:25 AM

అరకు ఉత్సవ్‌-2026 రెండో రోజు కార్నివాల్‌ ఉత్సాహంగా సాగింది. ఈ కార్నివాల్‌లో జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాకిత్‌, ఇతర ప్రజాప్రతినిధులు నృత్యాలు చేశారు. వివిధ రాష్ట్రాల కళాప్రదర్శనలు అలరించాయి. హైదరాబాద్‌ సహారీ బ్యాండ్‌ జోష్‌ను నింపింది. ఉదయం లోతేరు వద్ద సైక్లింగ్‌ పోటీలు, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో హెలికాఫ్టర్‌ రైడ్‌, పారా మోటారు గ్లైడింగ్‌ను ఐటీడీఏ శ్రీపూజ ప్రారంభించారు. విజేతలకు ప్రజాప్రతినిధులు, అధికారులు నగదు బహుమతులను అందజేశారు. రెండో రోజూ ఆద్యంతం అరకు ఉత్సవ్‌ ఉల్లాసంగా సాగింది.

కోలాహలంగా కార్నివాల్‌

అరకు ఉత్సవ్‌-2026 రెండో రోజు కార్నివాల్‌ ఉత్సాహంగా సాగింది. ఈ కార్నివాల్‌లో జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాకిత్‌, ఇతర ప్రజాప్రతినిధులు నృత్యాలు చేశారు. వివిధ రాష్ట్రాల కళాప్రదర్శనలు అలరించాయి. హైదరాబాద్‌ సహారీ బ్యాండ్‌ జోష్‌ను నింపింది. ఉదయం లోతేరు వద్ద సైక్లింగ్‌ పోటీలు, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో హెలికాఫ్టర్‌ రైడ్‌, పారా మోటారు గ్లైడింగ్‌ను ఐటీడీఏ శ్రీపూజ ప్రారంభించారు. విజేతలకు ప్రజాప్రతినిధులు, అధికారులు నగదు బహుమతులను అందజేశారు. రెండో రోజూ ఆద్యంతం అరకు ఉత్సవ్‌ ఉల్లాసంగా సాగింది.

నృత్యాలు చేసిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, పీవో

రెండు కిలోమీటర్లు సాగిన ప్రదర్శన

జోష్‌ నింపిన సాంస్కృతిక ప్రదర్శనలు

అలరించిన హైదరాబాద్‌ సహారీ బ్యాండ్‌

మిల్లెట్స్‌తో తయారుచేసిన అరకు కవుని రుచికి ఫిదా

లోతేరు నుంచి అంజోడ ఫైనరీ వరకు సైక్లింగ్‌ పోటీలు

కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో హెలికాఫ్టర్‌ రైడ్‌,

పారా మోటారు గ్లైడింగ్‌ను ప్రారంభం

రెండో రోజు సందడిగా సాగిన అరకు ఉత్సవ్‌

అరకులోయ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):

అరకు ఉత్సవ్‌-2026 రెండో రోజు కార్నివాల్‌ కోలాహలంగా సాగింది. అరకులోయ గిరిజన మ్యూజియం నుంచి ప్రారంభమైన ప్రదర్శన వివిధ వేషధారణలు, పలు రాష్ట్రాల కళాకారుల నృత్యాలతో అందరినీ అలరించింది. ఆధ్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ట్రైబల్‌ మ్యూజియం ఆవరణలోని కళాగ్రామం వద్ద కార్నివాల్‌ను జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర ప్రత్యేక వేషధారణతో ఢంకాను కొట్టి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ దింసా నృత్యం చేశారు. దీంతో కళాకారులు, పర్యాటకులు, స్థానికుల్లో జోష్‌ నింపారు. కార్నివాల్‌లో పలు రాష్ట్రాలకు చెందిన గిరిజన సంస్కృతిని ప్రతిబింబింపజేసే ప్రదర్శనలతో అరకులోయ హోరెత్తింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన వేదిక వరకు కార్నివాల్‌ సందడిగా సాగింది. రాత్రి ఎనిమిది గంటలకు డిగ్రీ కళాశాలలోని ప్రధాన వేదిక వద్దకు చేరుకుంది. అనంతరం అక్కడ వేదికపై పలు రాష్ట్రాల గిరిజనుల ఆచార, సంప్రదాయాల కళాప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు హైదరాబాద్‌కు చెందిన సౌత్‌ సెంట్రల్‌ ఇండియా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సహారీ బ్యాండ్‌ ప్రదర్శన ఆహూతులను అలరించింది. కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పీవో శ్రీపూజ, ఏస్పీ అమిత్‌బర్దర్‌, ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉత్సవ్‌కు వచ్చిన వారంతా పిల్లలతో జెయింట్‌ వీల్స్‌, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులో సరదాగా గడిపారు. మిల్లెట్స్‌తో తయారుచేసిన అరకు కవుని రుచికి అందరూ ఫిదా అయ్యారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు లోతేరు నుంచి అంజోడ వరకు సైక్లింగ్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీల్లో 42 మంది పాల్గొన్నారు. విశాఖపట్నంకు చెందిన కె.వంశీకిరణ్‌ ప్రథమ స్థానంలో నిలిచి రూ.25 వేలు, ఎస్‌.అభిషేక్‌ ద్వితీయ స్థానంలో నిలిచి రూ.15వేలు, జి.శ్యాం మనోహర్‌ తృతీయ స్థానంలో నిలిచి రూ. పది వేలు నగదు పారితోషకాన్ని పొందారు. విజేతలకు ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర, జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పీవో ఐటీడీఏ శ్రీపూజ, ఎస్పీ అమిత్‌బర్దర్‌, అరకు నియోజకవర్గ పరిశీలకులు తేజావతి, ఇన్‌చార్జి శివరామకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఏడాదిన్నరగా నిర్వహిస్తున్న నో టూ డ్రగ్స్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఉత్సవ్‌లో జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ సే నో టూ డ్రగ్స్‌ అని ఉన్న టీషర్టులను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఎస్పీ అమిత్‌ బర్దర్‌ మాట్లాడుతూ గంజాయి రహిత అల్లూరి జిల్లాకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం అతిథులు, కలెక్టర్‌, ఎస్పీ, ఐటీడీఏ పీవో థింసా కళాకారులతో కలిసి నృత్యం చేస్తూ అందర్నీ అలరించారు.

కొత్తవలసలో హెలీకాఫ్టర్‌ రైడ్‌,

పారా మోటారు గ్లైడింగ్‌ ప్రారంభం

కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీ ఫాంలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు హెలీకాఫ్టర్‌ రైడింగ్‌, పారా మోటారు గ్లైడింగ్‌లను జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ఐటీడీఏ పీవో శ్రీపూజ ప్రారంభించారు. అనంతరం పారా మోటారు గ్లైడింగ్‌లో కలెక్టర్‌ విహరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యాటకులు అరకు, చాపరాయి వంటి ప్రాంతాలను గగనతలం నుంచి తిలకించేందుకు ఈ రైడ్‌ దోహదపడుతుందన్నారు. అలాగే హెలీకాఫ్టర్‌లో కలెక్టర్‌, పీవో, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుటుంబం, ఆర్టీవో తదితరులు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎక్కువ ఎత్తుకు వెళ్లాల్సిన తరుణంలో టిక్కెట్‌ ధర ఎక్కువగా ఉంటుందని రైడ్‌ నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు. అయితే సాధ్యమైనంత తక్కువ ధరకే టిక్కెట్‌ నిర్ణయించాలని నిర్వాహకులకు కలెక్టర్‌ సూచించారు. అనంతరం 6 నిమిషాల హెలీకాఫ్టర్‌ రైడ్‌కు రూ.4 వేలు, పేరా మోటారు గ్లైడింగ్‌కు 6 నిమిషాలకు రూ.3 వేలు రేటు నిర్ణయించారు. ఉత్సవ్‌ సందర్భంగా పర్యాటకులకు, స్థానికులకు మూడు రోజులు పాటు ఈ రెండు అందుబాటులో ఉంటాయి.

Updated Date - Jan 31 , 2026 | 01:25 AM