పోర్టులో కార్గో మాఫియా
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:29 AM
విశాఖపట్నం పోర్టులో కార్గో మాఫియా వెర్రితలలు వేస్తోంది. పోర్టు ఇచ్చిన బిడ్ మొత్తం కంటే 99 శాతం తక్కువకు రెండు కంపెనీలు టెండర్లు వేయడం అటు పోర్టు యాజమాన్యంతో పాటు ఇటు వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బెర్తుల మెయింటెనెన్స్‌కు
టెండర్లు ఆహ్వానించిన యాజమాన్యం
99 శాతం తక్కువకు
బిడ్ వేసిన రెండు కంపెనీలు
మిగిలిన సంస్థల ఆశ్చర్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం పోర్టులో కార్గో మాఫియా వెర్రితలలు వేస్తోంది. పోర్టు ఇచ్చిన బిడ్ మొత్తం కంటే 99 శాతం తక్కువకు రెండు కంపెనీలు టెండర్లు వేయడం అటు పోర్టు యాజమాన్యంతో పాటు ఇటు వ్యాపార వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
విశాఖపట్నం పోర్టు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిమిత్తం కొన్ని బెర్తులను ప్రైవేటుకు ఇస్తామంటూ ఇటీవల టెండర్లు పిలిచింది. వెస్ట్ క్యూ, వెస్ట్ క్యూ 1 ఆర్‌ఈ, వెస్ట్ క్యూ 2, 3, ఈస్ట్ క్యూ3, 4 బెర్తులకు ఈ ప్రకటన ఇచ్చింది. ఆ బెర్తులలో హ్యాండిల్ చేసే సరకులో ప్రతి టన్నుకు పోర్టుకు రూ.65 హ్యాండ్లింగ్ చార్జీలు చెల్లించాలని షరతు విధించింది. అంటే బెర్త్ దక్కించుకునే కంపెనీ, పోర్టుకు టన్నుకు రూ.65 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ జనరల్ కార్గో బెర్తులే. టెండర్ దక్కించుకునే కంపెనీ పోర్టు ద్వారా సరకులు తెప్పించుకునే వారితో ఒప్పందం చేసుకుని వారి నౌకలు ఈ బెర్తులకు రప్పించుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఏడాదికి కచ్చితంగా రెండు నుంచి మూడు మిలియన్ టన్నుల సరకు హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సరకులను నౌకల నుంచి ఎత్తి, దించడానికి, తిరిగి లోడింగ్ చేయడానికి భారీ క్రేన్లు అవసరం అవుతాయి. అవి ఒక్కొక్కటి రూ.55 కోట్లు ఖరీదు. కనీసం రెండు క్రేన్లు ఉండాలి. అంటే రూ.110 కోట్లు పెట్టుబడి కావాలి. అయితే ఈ టెండర్లలో కొన్ని బెర్తులకు రెండు ప్రముఖ షిప్పింగ్ కంపెనీలు పోర్టు పేర్కొన్న మొత్తంలో 99 శాతం...అంటే టన్నుకు సుమారు రూ.64 ఇస్తామని ముందుకు వచ్చాయి. టెండర్లను ఎక్కడైనా 5 శాతం, పది శాతం, 15 శాతం తక్కువకు వేస్తారు. కానీ ఇక్కడ 99 శాతం తక్కువకు వేశారు. రెండు కంపెనీలు కూడబలుక్కున్నట్టు ఒకే రేటుకు వేయడం మరో విశేషం. వారు ఎందుకు అంత తక్కువకు టెండర్ వేశారో ఎవరికీ అంతుబట్టడం లేదు.
కాలుష్యం పట్టదా...?
పోర్టులో సరకుల రవాణా వల్ల నగరంలో కాలుష్యం పెరుగుతోంది. కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక్కో కంపెనీ మూడేసి బెర్తులు తీసుకొని, తక్కువ మార్జిన్ తీసుకుంటున్నామని, నిబంధనలు పాటించకపోతే దాని ఫలితం ప్రజలు అనుభవించాల్సిందే. పోర్టు యాజమాన్యం ఇలాంటి వింత పోకడలకు చెక్ పెట్టకపోతే యాఫియాను ప్రోత్సహించినట్టు అవుతుందనే వాదన వినిపిస్తోంది.