Share News

యాలకులతో కాఫీ రైతులకు అధిక ఆదాయం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:25 AM

గిరిజన కాఫీ రైతులు యాలకులను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. పాడేరు మండలం గొండెలి పంచాయతీ లంపెలి గ్రామంలో యాలకుల మొక్కలను నాటి ప్రయోగాత్మక సాగును ఆమె ప్రారంభించారు.

యాలకులతో కాఫీ రైతులకు అధిక ఆదాయం
లంపెలి గ్రామంలో యాలకుల మొక్కలను నాటిస్తున్న కలెక్టర్‌ నిషాంతి, తదితరులు

కలెక్టర్‌ టి.నిషాంతి

- పాడేరు మండలం లంపెలి గ్రామంలో ప్రయోగాత్మక సాగు ప్రారంభం

పాడేరు, ఆగస్టు 11(ఆంఽధ్రజ్యోతి): గిరిజన కాఫీ రైతులు యాలకులను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చునని కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. పాడేరు మండలం గొండెలి పంచాయతీ లంపెలి గ్రామంలో యాలకుల మొక్కలను నాటి ప్రయోగాత్మక సాగును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని వాతావరణం యాలకుల సాగుకు ఎంతో అనుకూలంగా ఉందని సుగంధ్ర ద్రవ్యాల శాస్త్రవేత్తలు సూచించారన్నారు. అందువలన గిరిజన రైతులు కాఫీ తోటల్లో నీడలోనే యాలకుల మొక్కల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చునన్నారు. అలాగే జిల్లాలో సేంద్రీయ పద్ధతిలో వాటిని సాగు చేయడం వలన మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంటుందని, సరైన యాజమాన్య పద్ధతుల్లో యాలకులను పండిస్తే నాణ్యతను బట్టి కిలో రూ.3 వేలు నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుందని చెప్పారు. లంపెలి గ్రామంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న వాటి సాగు విజయవంతం చేసి జిల్లా వ్యాప్తంగా యాలకుల ఉత్పత్తి జరిగేలా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం అరకు కాఫీ పేరిట జిల్లాకు విశ్వవ్యాప్తంగా ఎంత పేరు లభించిందో భవిష్యత్తులో యాలకుల ఉత్పత్తితో అదే స్థాయిలో ఖ్యాతిని గడించేందుకు కృషి చేస్తామన్నారు. యాలకులను సాగు చేసే గిరిజన కాఫీ రైతులకు స్పైసెస్‌ బోర్డు, ఉద్యానవనాధికారులు సంపూర్ణ సహకారం అందిస్తారని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే వేసవిలో నీటి యాజమాన్యాన్ని పాటించేందుకు అవసరమైన డ్రిప్‌ పరికరాలను అందిస్తామన్నారు. గిరిజన రైతులు యాలకుల మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలను స్పైసెస్‌ బోర్డు శాస్త్రవేత్తలు ఎస్‌.కుమార(కర్ణాటక), కేఏ.సాదు(కేరళ) తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్‌ బోర్డు సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ బి.కల్యాణి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, ఏడీ ప్రభాకరరావు, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఆర్‌.రమేశ్‌, కాఫీ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సిబ్బంది, గిరిజన రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:25 AM