అదుపుతప్పిన కారు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:54 AM
నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్ సమీపాన గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందనున్న డ్రైనేజీ కాల్వలోకి బోల్తాపడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు.
బ్రిడ్జి పైనుంచి కిందనున్న డ్రైనేజీలోకి బోల్తా
ఇద్దరు మహిళల మృతి...మరో ముగ్గురికి గాయాలు
శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
కూర్మన్నపాలెం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్ సమీపాన గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందనున్న డ్రైనేజీ కాల్వలోకి బోల్తాపడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా గాజువాక కణితి రోడ్డులో లఖనాపురం వెంకటరమణమూర్తి, భార్య మంగ (46), కుమారుడు సందీప్‌కుమార్, మనమరాలు (కుమార్తె కూతురు) తన్వీ (7) నివాసం ఉంటున్నారు. మంగ, తన్వీ, సమీప అజీమాబాద్ ప్రాంతానికి చెందినబన్నా కుసుమ (47), వారి కుమారుడు బాలమురళీకృష్ణ, బంధువు విజయలక్ష్మి (56) కలిసి బుధవారం కారులో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు అనకాపల్లి వెళ్లారు. గురువారం ఉదయం అనకాపల్లి నుంచి గాజువాక తిరిగి బయలుదేరారు. కూర్మన్నపాలెం జంక్షన్ సమీపాన...స్టీల్ సిటీ ఆర్టీసీ డిపో ఎదురుగా గల వంతెనపై కారు అదుపు తప్పి కిందనున్న డ్రైనేజీలో పడిపోయింది. అదే ప్రాంతానికి చెందిన మరికొందరు వీరి వెనుక వస్తూ ప్రమాదాన్ని గమనించి, తక్షణమే పోలీసులకుసమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు, స్థానికుల సహాయంతో డ్రైనేజీలో బోల్తాపడిన కారును, అందులో ఉన్నవారిని బయటకు తీశారు. అప్పటికే మంగ మృతిచెందారు. మిగిలిన వారికి గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బన్నా కుసుమ మృతిచెందారు. బాలమురళీకృష్ణ, విజయలక్ష్మి, తన్వీలకు చికిత్స కొనసాగిస్తున్నారు. మృతులు మంగ, కుసుమల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. బన్నా కుసుమ భర్త సింహాచలం, గాజువాక ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూలు నడుపుతున్నారు. మంగ భర్త లఖనాపురం సందీప్‌కుమార్ ఫిర్యాదుతో దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ డిపోలకు చేరని రాగులు!
ఈ నెలకు లేనట్టేనా?
పంచదార కూడా అరకొరగానే సరఫరా
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
బియ్యం కార్డుదారులకు రాగుల పంపిణీ సజావుగా సాగడం లేదు. జూలై నెలకు సంబంధించి రాగులు ఇప్పటివరకూ రేషన్ డిపోలకు చేరలేదు. గోదాములకు రాగులు చేరినా అక్కడ నుంచి డిపోలకు సరఫరా చేయడంలో సాంకేతిక సమస్య తలెత్తిందని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో అరకొరగా కార్డుదారులకు రాగులు పంపిణీ చేశారు. ఆ తరువాత మూడు నెలలపాటు మరిచిపోయారు. గత నెలలో మళ్లీ రాగులు అందజేశారు. చాలామంది కార్డుదారులు బియ్యానికి బదులు రాగులు తీసుకున్నారు. అయితే జూలై నెలలో మళ్లీ సమస్య తలెత్తింది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు రేషన్ డిపోల వద్ద బియ్యం, పంచదార, గోధుమపిండి, రాగులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం వారం ముందు నుంచే పౌర సరఫరాల సంస్థ గోదాము నుంచి రేషన్ డిపోలకు అన్ని సరుకులు సరఫరా ప్రారంభిస్తారు. ఒకటో తేదీకి అన్నీ సిద్ధంగా ఉండాలి. కానీ ఇంతవరకు జిల్లాలో 642 డిపోలకు రాగులు అందలేదు. జూలై నెల కోసం సుమారు 400 టన్నుల రాగులు కేటాయించారు. అందులో కొంతమేర జిల్లాకు చేరిందని చెబుతున్నారు. రేషన్ డిపోలకు సరఫరా సమయంలో సాంకేతిక సమస్య తలెత్తిందని చెబుతున్నారు. సరుకుల పంపిణీ సమయంలో సర్వర్ పనిచేయకపోతే యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తుంటారు. అటువంటప్పుడు రాగుల పంపిణీలో సాంకేతిక సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జూలై నెలకు సంబంధించి పంచదార కూడా అన్ని డిపోలకు ఇండెంట్ మేరకు అందలేదు. కొన్ని డిపోలకు అసలు పంచదార ఇవ్వలేదు. డిపోలకు సరిపడా సరుకులు సరఫరా చేయడంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంకా అందని స్కూల్ బ్యాగులు
బూట్లు కూడా
మూడు మండలాల్లో మాత్రమే పంపిణీ
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు వారాలైనా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంకా స్కూల్ బ్యాగులు అందలేదు. దీంతో గత ఏడాది ఇచ్చిన పాత, చిరిగిన బ్యాగుల్లోనే విద్యార్థులు పుస్తకాలు తీసుకువస్తున్నారు. గత ఏడాది పాఠశాలలు పునఃప్రారంభం రోజునే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్లు అందజేశారు. కిట్‌లో యూనిఫాం, బ్యాగులు, బూట్లు, బెల్టులు, నోట్ పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, నిఘంటువు ఉంటాయి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకూ బ్యాగులు రాలేదు. జిల్లాలో గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల సంఖ్య 69,279. దీనిని పరిగణనలోకి తీసుకుని ఐదు నుంచి పది శాతం ఎక్కువ కిట్లు అవసరం అవుతాయి. అయితే బ్యాగులు, బూట్లు తప్ప మిగిలినవన్నీ గత నెలలోనే జిల్లాకు వచ్చాయి. మూడు మండలాల పరిధిలో 16,410 మందికి బూట్లు పంపిణీ చేశామని, మిగిలిన మండలాలకు త్వరలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. బ్యాగులు ఇంకా జిల్లాకు రావలసి ఉందన్నారు.