Share News

కారు బీభత్సం

ABN , Publish Date - Aug 30 , 2026 | 11:09 PM

మండలంలోని అంతర్ల జాతీయ రహదారిపై ఆదివారం ఒక కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారును నడిపి నాలుగు ద్విచక్ర వాహనాలు, కారును ఢీకొట్టడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

కారు బీభత్సం
ప్రమాదానికి కారణమైన కారు

మద్యం మత్తులో నాలుగు ద్విచక్ర వాహనాలు, కారును ఢీకొన్న యువకులు

ఒకరికి స్వల్ప గాయాలు

పోలీసుల అదుపులో నిందితులు

చింతపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంతర్ల జాతీయ రహదారిపై ఆదివారం ఒక కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారును నడిపి నాలుగు ద్విచక్ర వాహనాలు, కారును ఢీకొట్టడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

తునికి చెందిన పడాల సాయి, మామిడి రమేశ్‌, కిరణ్‌ కారులో ఆదివారం ఉదయం ధారకొండ ధారాలమ్మ దేవాలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం అక్కడే మద్యం సేవించి, భోజనాలు చేసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మద్యం మత్తులో అంతర్ల జాతీయ రహదారి టీటైం వద్ద రహదారి పక్కన పార్కు చేసిన నాలుగు ద్విచక్ర వాహనాలు, కారును వేగంగా ఢీకొట్టారు. ద్విచక్ర వాహనాలు కారు చక్రాల కింద ఇరుక్కోవడంతో అక్కడితో ఆగిపోయింది. లేకుంటే టీటైంలో ఉన్న వారిపైకి దూసుకువెళ్లేదని స్థానికులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో రహదారిపై నడిచి వెళుతున్న జి.రమేశ్‌ అనే యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 30 , 2026 | 11:09 PM