Share News

టైరు పేలడంతో హైవేపై కారు బోల్తా

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:56 AM

జాతీయ రహదారిపై ఎలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి జంక్షన్‌ వద్ద శనివారం సాయంత్రం టైరు పేలడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

టైరు పేలడంతో హైవేపై కారు బోల్తా
బోల్తా పడిన కారు

మహిళ మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

ఎలమంచిలి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై ఎలమంచిలి సమీపంలోని కొక్కిరాపల్లి జంక్షన్‌ వద్ద శనివారం సాయంత్రం టైరు పేలడంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట పట్టణంలోని శాంతినగరం ప్రాంతానికి చెందిన షేక్‌ మిరాబీ (35), బడుగు దుర్గ, వరలక్ష్మి, శివమ్మ, ఝాన్సీ సంతల్లో ఫ్యాన్సీ వస్తువులు విక్రయించడంతో పాటు క్యాటరింగ్‌ పనులకు వెళుతుంటారు. వీరందరినీ వంట మాస్టర్‌ సతీశ్‌ కారులో శుక్రవారం అనకాపల్లి సమీపంలో క్యాటరింగ్‌ పనులకు తీసుకువెళ్లారు. పనులు పూర్తిచేసి అంతా కారులో శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో జాతీయ రహదారిపై కొక్కిరాపల్లి జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి వెనుక టైరు పేలిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, అవతలి వైపు రోడ్డులోకి దూసుకుపోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో షేక్‌ మిరాబీ అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిరాబీ మృతదేహాన్ని ఎలమంచిలి సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రూరల్‌ ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 25 , 2026 | 12:56 AM