డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన కారు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:38 AM
జాతీయ రహదారిపై మండలంలోని గోకులపాడు వద్ద గురువారం మధ్యాహ్నం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, రహదారిపై బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కారులో వున్న వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
నూతన వధూవరులకు తప్పిన ప్రమాదం
అన్నవరంలో వ్రతం చేసుకొని విశాఖ వెళుతుండగా ఘటన
ఎస్.రాయవరం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మండలంలోని గోకులపాడు వద్ద గురువారం మధ్యాహ్నం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నూతన వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, రహదారిపై బోల్తా పడింది. అదృష్టవశాత్తూ కారులో వున్న వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నంలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన పీవీఎస్ చంద్రమౌళి, అఖిలకు ఈ నెల ఒకటో తేదీ బుధవారం రాత్రి వివాహమైంది. నూతన వధూవరులు అన్నవరంలో సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకోవడానికి మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి కారులో గురువారం ఉదయం విశాఖ నుంచి అన్నవరం వెళ్లారు. అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకుని మధ్యాహ్నం తిరిగి విశాఖపట్నం వెళుతుండగా గోకులపాడు వద్ద కారు అదుపుతప్పి కుడివైపున ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొన్నది. ఈ క్రమంలో రహదారిపై బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి, కారులో నుంచి అందరినీ బయటకు తీశారు. అదృష్టవశాత్తూ కారులో ఉన్న నూతన దంపతులతోపాటు మిగిలిన వారికి ఎటువంటి గాయాలు కాలేదు. కారు బోల్తా పడిన సమయంలో వెనుక నుంచి భారీ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. నూతన వఽధూవరులతోపాటు కుటుంబ సభ్యులు మరో కారులో విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.