ట్రాక్టర్‌ను ఢీకొని పల్టీలుకొట్టిన కారు
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:10 AM
జాతీయ రహదారిపై నక్కపల్లి వారపుసంత సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
మహిళకు తీవ్రగాయాలు
నక్కపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై నక్కపల్లి వారపుసంత సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధి మంత్రిపాలెం ప్రాంతానికి చెందిన దుంగా అప్పలస్వామి ట్రాక్టర్ ఇంజన్‌తో పాయకరావుపేట వెళుతున్నాడు. ఇదే మార్గంలో కొత్తవలస నుంచి ద్రాక్షారామ వెళుతున్న కారు వస్తున్నది. నక్కపల్లి వారపుసంత సమీపంలోకి వచ్చేసరికి కారు డ్రైవర్ మితిమీరిన వేగంతోపాటు నిర్లక్ష్యంగా నడుపుతూ ట్రాక్టర్ ఇంజన్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొన్నాడు. దీంతో కారు గాలిలోకి మూడు పల్టీలుకొట్టి, నడిరోడ్డుపై తిరగబడింది. కారులో వున్న గెద్దాడ పద్మావతికి తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న ప్రవీణ్‌తోపాటు ట్రాక్టర్ నడుపుతున్న అప్పలస్వామి గాయపడ్డారు. కారులో వున్న రాజ్‌కుమార్, సాయి శరణ్ క్షేమంగా బయటపడ్డారు. అప్పలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ మురళీ చెప్పారు.