డివైడర్‌ను ఢీకొన్న కారు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:48 AM
అనకాపల్లి- ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిపై అనకాపల్లి మండలం కోడూరు వద్ద డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి.రవికుమార్ తెలిపిన వివరాలిలా వున్నాయి.
యువకుడి దుర్మరణం
కొత్తూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి- ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిపై అనకాపల్లి మండలం కోడూరు వద్ద డివైడర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి.రవికుమార్ తెలిపిన వివరాలిలా వున్నాయి.
విశాఖ నగరంలోని సింహాచలం ప్రాంతానికి చెందిన మానాపురం పరమేశ్ (29) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అనకాపల్లిలో ఉన్న బావమరిది కుమారుడి బారసాల కార్యక్రమం నిమిత్తం విజయా రెసిడెన్సీకి వచ్చారు. కుటుంబ సభ్యులను ఇక్కడ డ్రాప్ చేసి, తనకు సబ్బవరంలో పని వుందంటూ 8.40 గంటలకు ఒక్కడే కారులో బయలుదేరాడు. సుమారు పది గంటల సమయంలో పరమేశ్‌కు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ తీసి, కోడూరు వద్ద కారు ప్రమాదానికి గురైందని, డ్రైవింగ్ సీటులో వున్న వ్యక్తి మృతిచెందాడని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. పరమేశ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. కారు తొలుత డివైడర్‌ను ఢీకొని, అనంతరం అదుపు తప్పి ఎడమ వైపునకు వచ్చి క్రాష్ బారియర్‌ను ఢీకొన్నది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.