కారు బీభత్సం
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:14 PM
మండలంలోని పెంటపాడు జాతీయ రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తున్న గిరిజన మహిళల పైనుంచి కారు దూసుకు వెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తున్న గిరిజన మహిళలపైకి దూసుకెళ్లిన వైనం
ఒకరు మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు
చింతపల్లి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెంటపాడు జాతీయ రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తున్న గిరిజన మహిళల పైనుంచి కారు దూసుకు వెళ్లడంతో ఒక మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పెంటపాడు గ్రామానికి చెందిన గిరిజన మహిళలు కొంత కాలంగా కృష్ణాదేవిపేట- చింతపల్లి జాతీయ రహదారి దామనాపల్లి జంక్షన్లో కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో రింతాడ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సాగిన విజయ భాస్కర్ కారులో చింతపల్లి నుంచి స్వగ్రామానికి వెళుతున్నారు. పెంటపాడు మలుపు, దామనాపల్లి జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తున్న మహిళలను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కూరగాయలు విక్రయిస్తున్న వంతల సుశీల(45) సంఘటన స్థలంలో మృతి చెందగా, మరో మహిళ పాంగి సావిత్రి తలకు బలమైన గాయాలయ్యాయి. బాధితురాలిని స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యాధికారి చందన ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా కారు నడుపుతున్న విజయ భాస్కర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ జి.వీరబాబు తెలిపారు.