సాగునీటి కాలువల గోడు పట్టదా?
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:40 PM
మండలంలోని సాగునీటి కాలువలు పూడుకుపోయాయి. తుప్పలు పెరిగిపోయి కాలువల ఆనవాళ్లే లేకుండాపోయాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం
పూడుకుపోయిన కాలువలు
ఆరు వేల ఎకరాలకు చుక్కనీరు అందని దుస్థితి
ఇప్పటికీ అదే పరిస్థితి
చోడవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సాగునీటి కాలువలు పూడుకుపోయాయి. తుప్పలు పెరిగిపోయి కాలువల ఆనవాళ్లే లేకుండాపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాగా, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
వందలాది ఎకరాలకు సాగునీరు అందించే మండలంలోని సాగునీటి కాలువల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. కాలువలపై ఆధారపడిన భూములకు సాగునీరు అందని దుస్థితి కొనసాగుతోంది. వర్షాలు తగ్గి వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రస్తుత సమయంలో సాగునీటి కాలువల పనులు చేపడితే వచ్చే సీజన్ నాటికి కాలువల్లో నీరు పారే అవకాశం ఉంది. కానీ సాగునీటి కాలువల అభివృద్ధి పనుల్లో కదలిక కనిపించడం లేదు. ఈ ఏడాది మే నెలలో మండలంలో ఆరు కాలువలకు నిధులు మంజూరైనప్పటికీ, ఈ కాలువల అభివృద్ధి పనులు మాత్రం ముందుకు కదల్లేదు. తరువాత వర్షాలు రావడంతో సాగునీటి కాలువల పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో కాలువల పరిస్థితి అధ్వానంగా మారడంతో సాగునీటి కాలువల పరిధిలోని పంటభూముల్లో వ్యవసాయం దైవాదీనంగానే మారిపోయింది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో రైవాడ, పెద్దేరు, ఇతర చెరువులు, ఆవల పరిధిలోని సాగునీటి కాలువలకు గత ప్రభుత్వంలో కనీస స్థాయిలో కూడా నిర్వహణకు నిధులు కేటాయించలేదు. దీంతో ఎక్కడికక్కడ కాలువల్లో తుప్పలు పేరుకుపోయి సాగునీటి కాలువల ఆనవాళ్లు లేకుండాపోయాయి.
వందలాది ఎకరాలకు సాగునీరు అందని దుస్థితి
మండలం పరిధిలో రైవాడ కాలువ కింద లక్కవరం, గవరవరం, సింహాద్రిపురం, చోడవరం, జుత్తాడ, రేవళ్లు, తదితర ప్రాంతాలకు చెందిన పంట భూములు ఉన్నాయి. రైవాడ కాలువల నిర్వహణ లేకపోవడంతో ఈ పంచాయతీల్లోని వందలాది ఎకరాలకు సాగునీరు చాలా కాలంగా అందని దుస్థితి నెలకొంది. లక్కవరం ప్రాంత రైతులు, రేవళ్లు ప్రాంత రైతులు కొంతకాలం చందాలు వేసుకుని శ్రమదానంతో కాలువలు బాగు చేసుకుని సాగునీరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసినా అధికారుల్లో కానీ, ప్రభుత్వంలో కానీ స్పందన లేకపోవడంతో రైతులు అలసిపోయారు. రైవాడ కాలువలు బాగు చేయాలంటూ రైతు సంఘం నాయకుడు కోన మోహనరావు ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేసి, జలవనరుల శాఖ అఽధికారులకు వినతులు ఇచ్చినా స్పందన కరువైంది. ఇక ఈ రైవాడ కాలువల సంగతి పక్కన పెడితే, పెద్దేరు నది మీద ఉన్న గ్రోయిన్లు చాలాకాలంగా శిథిలావస్థకు చేరడంతో ఈ గ్రోయిన్ల పరిధిలోని కాలువలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మండలంలోని పెద్దేరు పరిధిలోని సాగునీటి కాలువలు కూడా తుప్పలు పెరిగిపోయి నీరు పారని పరిస్థితి నెలకొంది. బెన్నవోలు ఆవ నుంచి వచ్చే సాగునీరు పరిధి కుంచించుకుపోయింది. ఈ సాగునీటి కాలువల నిర్వహణ లేకపోవడంతో నీరు పారడం లేదు. రెండేళ్ల క్రితం బెన్నవోలు ఆవలో జన్నవరం ప్రాంతానికి చెందిన రైతులు శ్రమదానంతో కాలువలు బాగు చేసినా, మళ్లీ మరుసటి ఏడాదికి పరిస్థితి మొదటికే వచ్చింది. గతంలో ఏటా జలవనరుల శాఖ అధికారులు వానాకాలం రాక ముందే వేసవిలో సాగునీటి కాలువల్లో పూడిక, చెత్త తొలగించే పనులను ఉపాధి నిధులతో చేపట్టేవారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కాలువలను పూర్తిగా పట్టించుకోకపోవడంతో సాగునీటి వనరులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్దేరు నది, బెన్నవోలు ఆవ పరిధిలో బెన్నవోలు ఆవ కాలువ, బెన్నవోలు నుంచి జన్నవరం కాలువ కింద బెన్నవోలు, తిమ్మనపాలెం, కన్నంపాలెం, చాకిపల్లి వరకు సుమారు రెండు వేల ఎకరాలు కాలువలపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ కాలువల్లో బెన్నవోలు నుంచి జన్నవరం కాలువ పనులు మాత్రం ప్రారంభమై కొంత మేర పనులు జరిగిన తరువాత చెల్లింపులు లేక పనులు ఆగిపోయాయి. దీంతో ఈ కాలువల కింద భూములకు సాగునీరు అందడం లేదు. మొత్తం మీద మండలంలోని సాగునీటి కాలువలపై ఉన్న ఆరు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగానే ఉండడంతో రైతాంగంలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఈ ఏడాదైనా సాగునీటి కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.