కాలువ బాగు.. సాఫీగా సాగు
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:02 AM
మూడు గ్రామాలకు చెందిన సుమారు ఆరు వందల ఎకరాలకు సాగు నీరు అందించే పంట కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షలతో కాలువ రెండు పక్కల 70 మీటర్ల పొడవున సిమెంట్ కాంక్రీట్ వాల్ నిర్మించగా, కాలువలో పూడిక తీత పనులను రైతులు సొంత ఖర్చుతో చేయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ నుంచి పొలాలకు సాఫీగా నీరు సరఫరా అవుతుందని రైతులు చెబుతున్నారు.
రూ.30 లక్షలతో సిమెంట్ కాంక్రీట్ గోడల నిర్మాణం
ఆధునికీకరణ పనులతో గట్ల కోతకు చెక్
మూడు గ్రామాల రైతుల ఆనందం
మాకవరపాలెం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మూడు గ్రామాలకు చెందిన సుమారు ఆరు వందల ఎకరాలకు సాగు నీరు అందించే పంట కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షలతో కాలువ రెండు పక్కల 70 మీటర్ల పొడవున సిమెంట్ కాంక్రీట్ వాల్ నిర్మించగా, కాలువలో పూడిక తీత పనులను రైతులు సొంత ఖర్చుతో చేయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ నుంచి పొలాలకు సాఫీగా నీరు సరఫరా అవుతుందని రైతులు చెబుతున్నారు.
కోటవురట్ల మండలం యండపల్లి వద్ద వరహా నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ నుంచి యండపల్లితోపాటు మాకవరపాలెం మండలంలోని మల్లవరం, గిడుతూరు గ్రామాలకు చెందిన సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ఏడాది మెథా తుఫాన్ సమయంలో కురిసిన భారీ వర్షాలకు నది నుంచి వరద నీరు పంట కాలువలోకి అధికంగా ప్రవహించడంతో యండపల్లి- మల్లవరం మధ్య కాలువ గట్టుకు గండిపడింది. వరద ఉధృతి తగ్గేవరకు గండి పూడ్చడానికి వీలుకాలేదు. ఇదే సమయంలో వరి పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారు. ఇక్కడ కాలువ గట్టు బలహీనంగా వుండడంతో భవిష్యత్తులో మళ్లీ గండి పడే అవకాశం వుందని, ఈ సమస్య తలెత్తకుండా వుండాలంటే కాలువకు ఇరువైపులా సిమెంట్ కాంక్రీట్ గోడ నిర్మించాలని ఆయకట్టు రైతులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడుని కలిసి విజ్ఞప్తిచేశారు. ఆయన కాలువ గండి పడిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించి వచ్చే ఖరీఫ్ నాటికి కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని అధికారులను అదేశించారు. అనంతరం ప్రభుత్వం నుంచి రూ.30 లక్షలు మంజూరు చేయించారు. సుమారు రెండు నెలల క్రితం పనులు ప్రారంభించారు. సుమారు 70 మీటర్ల పొడవున, ఇరువైపులా సిమెంటు కాంక్రీట్ గోడ నిర్మించారు. అయితే కాలువలో పూడిక, తుప్పలు పెరిగిపోవడంతో రైతులు చందాలు వేసుకొని, ఎక్స్‌కవేటర్‌తో పూడిక తీయిస్తున్నారు. వారం రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని, వరహా నది నుంచి ఆయకట్టుకు నీరు సాఫీగా అందతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో మూడు గ్రామాల రైతులకు సాగునీటి సమస్య తొలగిందని సాగునీటి సంఘం అధ్యక్షుడు దొరబాబు, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి చినబాబు, నాయకులు బుచ్చిరాంప్రసాద్, రామచంద్రరావు హర్షం వ్యక్తం చేశారు.