ముగిసిన ప్రాదేశిక ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:41 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. చివరి రోజు కావడంతో కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు కలిసి భారీఎత్తున ప్రచారం చేశారు. ఈ విషయంతో ప్రతిపక్ష వైసీపీ ఒకింత వెనుకబడింది. బహిరంగంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు.. తెర వెనుక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు, మద్యం, కానుకలతో ఓటర్లను లోబరుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు రేపు పోలింగ్
పోలింగ్ సిబ్బందికి నేడు సామగ్రి పంపిణీ
24 జడ్పీటీసీలకు 80 మంది, 425 ఎంపీటీసీలకు 979 మంది పోటీ
ఏడున ఓట్ల లెక్కింపు
అనకాపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. చివరి రోజు కావడంతో కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు కలిసి భారీఎత్తున ప్రచారం చేశారు. ఈ విషయంతో ప్రతిపక్ష వైసీపీ ఒకింత వెనుకబడింది. బహిరంగంగా ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు.. తెర వెనుక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు, మద్యం, కానుకలతో ఓటర్లను లోబరుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం సాయంత్రానికి అన్ని పోలింగ్ బూత్‌లను సంబంధిత అధికారులు, పోలీసులు సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 427 ఎంపీటీసీ స్థానాలకుగాను రెండు ఏకగ్రీవంకాగా మిగిలిన 425 స్థానాలకు 979 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 24 జడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బుధవారం ఉదయం అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ర్టిబ్యూషన్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకొని, ఎన్నికల సామగ్రిని తీసుకుంటారు. అనంతరం వాహనాల్లో బయలుదేరి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఎన్నికల విధుల కోసం 12,600 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ర్టాంగ్ రూమ్‌లకు చేర్చి భద్రపరుస్తారు.
నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు: కలెక్టర్
అనకాపల్లి కలెక్టరేట్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్/ డిగ్రీ కళాశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ సెలవులకు బదులుగా సంబంధిత విద్యాసంస్థలు తదుపరి రోజుల్లో వచ్చే ఇతర సాధారణ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించుకోవచ్చని ఆమె వెల్లడించారు.