Share News

క్యాంప్‌ రాజకీయాల జోరు!

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:48 PM

ఈనెల 19న ఎంపీపీ, 20న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం క్యాంప్‌ రాజకీయాలు జోరందుకున్నాయి.

క్యాంప్‌ రాజకీయాల జోరు!

అజ్ఞాతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు

ప్రత్యర్థులకు దొరక్కుండా తమ సభ్యులను కాపాడుకుంటున్న పార్టీలు

19న ఎంపీపీ, 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక... అప్పటి వరకు అజ్ఞాతవాసమే

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఈనెల 19న ఎంపీపీ, 20న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం క్యాంప్‌ రాజకీయాలు జోరందుకున్నాయి. ఫలితంగా జిల్లాలోని వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు, పలుచోట్ల కూటమి పార్టీలు, వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు సైతం అజ్ఞాతంలో ఉన్నారు. ప్రధానంగా జడ్పీటీసీ సభ్యులు విషయంలో వైసీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. జిల్లాలోని మొత్తం 11 స్థానాలకుగానూ 7 వైసీపీ, 3 టీడీపీ, 1 సీపీఎం గెలుచుకున్న తరుణంలో చైర్మన్‌ పీఠం వైసీపీకి దక్కుతుంది. ఈక్రమంలో తమకున్న సభ్యులు చేజారిపోకుండా ఉండాలనే ఆలోచనతో ప్రస్తుతం వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యులందర్ని ఎవరికీ తెలియని ప్రాంతానికి తరలించారు. ఈనెల 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నికల నాడు వారంతా పాడేరు వస్తారు. అప్పటి వరకు వైసీపీకి చెందిన ఏడుగురు జడ్పీటీసీ సభ్యులు సైతం అజ్ఞాతంలోనే ఉంటారని తెలుస్తున్నది. అలాగే ఎంపీపీ పదవులను పొందాలనుకున్న నేతలు సైతం తమకు మద్దతుగా ఉన్న ఎంపీటీసీ సభ్యులను చేజార్చుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలోని పాడేరు, హుకుంపేట, ముంచంగిపుట్టు, జి.మాడుగుల చింతపల్లి మండలాల్లోని పలువురు ఎంపీటీసీ సభ్యులను శిబిరాలకు తరలించారని తెలిసింది. దీంతో రహస్యంగా తమ మద్దతుకు సంబంధించిన విషయాలపై చర్చలు జరుపుకొంటున్నారు. దీంతో ఈనెల 19 వరకు కొందరు ఎంపీటీసీ సభ్యులకు అజ్ఞాతవాసం తప్పదని చెప్పకతప్పదు.

Updated Date - Nov 14 , 2026 | 10:48 PM