సోదరుడి పరామర్శకు వచ్చి...మృత్యు ఒడికి
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:07 AM
అనారోగ్యంతో ఉన్న సోదరుడిని పరామర్శించడానికి వచ్చిన మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మృతురాలు సిరిసిల్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్
మద్దిలపాలెం (విశాఖపట్నం), ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
అనారోగ్యంతో ఉన్న సోదరుడిని పరామర్శించడానికి వచ్చిన మహిళను ఆర్టీసీ బస్సు బలి తీసుకుంది. సోమవారం సాయంత్రం నగరంలోని రామాటాకీస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటనకు సంబంధించి మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ భవానీనగర్‌లో నివాసముంటున్న చక్రవర్తుల రోజారాణి (53) సిరిసిల్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆమె సోదరుడు శ్రీనివాసరావు నగరంలోని ఆరిలోవ తోటగురువులో నివాసం ఉంటున్నారు. ఆయన అనారోగ్యంతో మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోదరుడిని పరామర్శించడానికి రోజారాణి నగరానికి వచ్చారు. అతనికి అవసరమైన మందుల కోసం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మరో సోదరుడు లక్ష్మణ్‌ప్రసాద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై నీలమ్మవేపచెట్టు ప్రాంతానికి బయలుదేరారు. వారి వాహనాన్ని రామాటాకీస్ సమీపాన శుభం ప్రేమ ఆసుపత్రి వద్ద వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో లక్ష్మణప్రసాద్ ఎడమ వైపు పడగా, రోజారాణి కుడి వైపు బస్సు కింద పడిపోయారు. ఆమె పైనుంచి బస్సు దూసుకువెళ్లడంతో రోజారాణి అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు, సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు సీఐల బదిలీ
ఫోర్త్ టౌన్ సీఐగా సీహెచ్ రాజేష్‌కు పోస్టింగ్
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సిటీ వీఆర్‌లో ఉన్న సీహెచ్ రాజేశ్‌కు ఫోర్త్ టౌన్ సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ పనిచేస్తున్న సీహెచ్ ఉమాకాంత్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే వీఆర్‌లో ఉన్న పిన్నింటి రమణను కంచరపాలెం ట్రాఫిక్ సీఐగా నియమించారు. అక్కడ పనిచేస్తున్న ఎ.దాశరధిని వీఆర్‌కు బదిలీ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు
ఓటర్ల జాబితాల విడుదల రేపు
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సర్పంచుల పదవీకాలం ఈ నెల రెండో తేదీతో ముగియడంతో ప్రత్యేకాధికారులను నియమించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికలకు కీలకమైన ఓటర్ల జాబితా ఖరారు, విడుదలకు అవసరమైన ఏర్పాట్లుచేసింది. మార్చి నెల తొమ్మిదో తేదీన పంచాయతీ ఓటర్ల జాబితా విడుదలకు ఫిబ్రవరిలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తరువాత 15వ తేదీకి వాయిదావేసింది. అయితే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేసినా విడుదల కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో ఈనెల 15వ తేదీన ఓటర్ల జాబితాలను పంచాయతీల వారీగా విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ జిల్లాలో 79 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను 15వ తేదీన విడుదల చేయాలని సమాచారం వచ్చింది. ఓటర్ల జాబితా విడుదల తరువాత అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించిన తరువాత తుది జాబితా విడుదల చేస్తారు. దీనిపై ఈనెల 15వ తేదీన అధికారికంగా ప్రకటన జారీచేయనున్నారు.
పట్టాలెక్కిన శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి):
దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన హంసఫర్ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం పట్టాలెక్కింది. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. అయితే తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌కు నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 19 (ఆదివారం) నుంచి అందుబాటులోకి రానుంది. శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి (17440): హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి సాయంత్రం 5.58 గంటలకు దువ్వాడ చేరుతుంది. మరుసటిరోజు (మంగళవారం) ఉదయం 8.10 గంటలకు తిరుపతి వెళుతుంది.
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు (17439): ఈ నెల 19 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4.55 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు (సోమవారం) ఉదయం 9.33 గంటలకు దువ్వాడ, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుతుంది. ఈ సర్వీసులకు 15 థర్డ్ ఏసీ, 4 స్లీపర్, 2 జనరల్ క్లాసు కమ్ లగేజీ, ఒక ప్యాంట్రీ కార్ కోచ్‌లు ఉంటాయి.