Share News

రిజర్వాయర్లలో కేజ్‌ కల్చర్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:34 AM

సాగునీటి జలాశయాల్లో కేజ్‌ కల్చర్‌ ద్వారా చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి త్వరలో విధివిధానాలు రూపొందించి రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున చేపలను ఉత్పత్తిని చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనుంది. రిజర్వాయర్లలో చేపల పెంపకానికి సంబంధించి స్థానిక మత్స్యకారుల సంఘాలకు 60 శాతం, కంపెనీలు లేదా సంస్థలకు 20 శాతం, నిరుద్యోగులకు 20 శాతం చొప్పున అప్పగిస్తారు.

రిజర్వాయర్లలో కేజ్‌ కల్చర్‌
పెద్దేరు రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్‌ యూనిట్‌ (ఫైల్‌ ఫొటో)

చేపల అధిక దిగుబడికి ప్రభుత్వం ప్రణాళిక

స్థానిక రకాల చేపల పెంపకానికి ప్రాధాన్యం

ఆదాయంలో 50 శాతం నీటి సంఘాలకు, 30 శాతం పంచాయతీకి, 20 శాతం మత్స్య శాఖకు

జిల్లాలో తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు, కల్యాణపులోవ జలాశయాలు అనుకూలం

చోడవరం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సాగునీటి జలాశయాల్లో కేజ్‌ కల్చర్‌ ద్వారా చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి త్వరలో విధివిధానాలు రూపొందించి రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున చేపలను ఉత్పత్తిని చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనుంది. రిజర్వాయర్లలో చేపల పెంపకానికి సంబంధించి స్థానిక మత్స్యకారుల సంఘాలకు 60 శాతం, కంపెనీలు లేదా సంస్థలకు 20 శాతం, నిరుద్యోగులకు 20 శాతం చొప్పున అప్పగిస్తారు. తద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం సొమ్ము సంబంధిత రిజర్వాయర్‌ నీటి సంఘాలకు, 30 శాతం స్థానిక పంచాయతీకి, మిగిలిన 20 శాతం మత్స్య శాఖకు ఇస్తారు. సాధారణ పద్ధతిలో కంటే.. కేజ్‌ కల్చర్‌ ద్వారా అత్యధికంగా చేపల దిగుబడి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

జిల్లాలో తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం మత్స్య శాఖ స్థానిక మత్స్యకారుల సహకారంతో చేపపిల్లల పెంపకం చేపడుతున్నా, ఆశించిన స్థాయిలో దిగుబడి ఉండడం లేదు. దీనివల్ల పంచాయతీలకు, నీటి సంఘాలకు ఎలాంటి అదనపు ఆదాయం ఉండడం లేదు. సంప్రదాయ విధానంలో కన్నా కేజ్‌ కల్చర్‌ ద్వారా చేపల పెంపకం చేపడితే అధిక మొత్తంలో దిగుబడి రావడంతోపాటు స్థానిక సంఘాలకు, పంచాయతీలకు ఆదాయం లభించడానికి అవకాశం ఉంది.

పెద్దేరులో కేజ్‌ కల్చర్‌

ప్రభుత్వం కేజ్‌ కల్చర్‌ ద్వారా చేపల పెంపకానికి సన్నాహాలు చేపడుతున్నప్పటికీ వాస్తవానికి 2017లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాడుగుల మండలం పెద్దేరు రిజర్వాయర్‌లో కేజ్‌ కల్చర్‌ ద్వారా ప్రయోగాత్మకంగా చేపల పెంపకం చేపట్టారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో కేజ్‌ కల్చర్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి తిలాపియా రకం చేపల పెంపకం చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంపెనీ సహకారంతో రిజర్వాయర్‌ మధ్యలో నీటిపై తేలాడేలా 24 కేజ్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఫైబర్‌ డబ్బాలు, పైపులు, డ్రమ్ములను వినియోగించారు. తిలాపియా రకానికి చెందిన కోటి 50 లక్షల చేప పిల్లలను ఈ కేజ్‌లలో వదిలారు. అయితే దక్షిణ ఆఫ్రికా రకానికి చెందిన ఈ తిలాపియా చేపలు దిగుబడి పెద్దగా రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు కొనసాగలేదు. స్థానికంగా పెంచే బొచ్చె రాగండి, బంగారుపాప, గడ్డిచేప, ఎర్రమైల వంటి రకాల పెంపకం చేపట్టి ఉంటే ఈ ప్రాజెక్టు విజయవంతం అయ్యేదని స్థానికులు భావించారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేజ్‌ కల్చర్‌లో ఈసారి స్థానిక రకాలకు చెందిన చేపలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 09 , 2026 | 12:34 AM