Share News

చెరువును చెరబట్టి..

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:47 AM

అధికారంలో వున్న పార్టీల నేతలు సహజ వనరులను దోపిడీ చేయడం సర్వసాధారణంగా మారింది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా సంబంధిత అధికారులు ఇటువంటి అక్రమార్కులపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు.

చెరువును చెరబట్టి..
జేవీ పాలెం చెరువులో ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తవ్వి టాక్టర్‌కు లోడింగ్‌ చేస్తున్న దృశ్యం

జేవీ పాలెం యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

పొలాన్ని మెరక చేయడానికి అనుమతులు

ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి తరలింపు

కూటమి నేత కావడంతో పట్టించుకోని అధికారులు

ఎస్‌.రాయవరం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): అధికారంలో వున్న పార్టీల నేతలు సహజ వనరులను దోపిడీ చేయడం సర్వసాధారణంగా మారింది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా సంబంధిత అధికారులు ఇటువంటి అక్రమార్కులపై చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటే తమను ఎక్కడ ‘శంకర’గిరి మాన్యాలకు బదిలీ చేస్తారోనని భయపడుతున్నారు.

పంట పొలాలను ఎత్తు చేసుకోవడానికి జలవనరులు, రెవెన్యూ శాఖల అనుమతితో స్థానికంగా వున్న చెరువుల్లో మట్టిని తవ్వుకోవచ్చని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనిని మండలంలోని జేవీ పాలెం గ్రామానికి చెందిన కూటమిలో ఒక ప్రధాన పార్టీ నేత ఒకరు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అదే గ్రామంలోని ఒక చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సదరు నేత కొద్ది రోజుల కిత్రం తన భార్య పేరిట ఉన్న 1.34 ఎకరాల వ్యవసాయ భూమిని మెరక చేయడానికి సమీపంలోని చెరువు నుంచి 1,500 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వుకోవడానికి అనుమతులు పొందారు. నిబంధల ప్రకారం ఇరిగేషన్‌ అధికారులు చూపిన ప్రదేశంలో మాత్రమే మట్టిని తవ్వి, పొలానికి తరలించాలి. ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి, పునాదులు కప్పడానికి, ఇతర అవసరాలకు మట్టిని వినియోగించకూడదు. మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రదేశంలో సంబంధిత శాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలి. కానీ ఇరిగేషన్‌ అధికారులు ఇటువైపు కన్నెత్తి అయినా చూడడం లేదు. సదరు కూటమి నేత రెండు ఎక్స్‌కవేటర్లతో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టిని తరలించడానికి సుమారు 30 ట్రాక్టర్లను పురమాయించారు. ఇక్కడ తవ్విన మట్టిని ప్రైవేటు స్థలాలను ఎత్తు చేయడానికి, ఇళ్ల పునాదులు నింపడానికి తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా జేవీ పాలెం చెరువులో మట్టి తవ్వకాలపై ఇరిగేషన్‌ ఏఈ అమీనా భానును వివరణ కోరగా, అనుమతి తీసుకున్న భూములకు తప్ప వేరే ప్రదేశాలకు మట్టి తరలించ కూడదని స్పష్టం చేశారు. తవ్వకాలు జరిగిన ప్రదేశాన్ని, మట్టిని డంప్‌ చేసిన ప్రదేశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

Updated Date - Jun 08 , 2026 | 12:47 AM