Share News

మే నెలాఖరు నాటికి ఎయిర్‌పోర్టు కనెక్షివిటీ రోడ్లు

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:28 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు మే చివరి నాటికి పూర్తిచేస్తామని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.

మే నెలాఖరు నాటికి  ఎయిర్‌పోర్టు  కనెక్షివిటీ రోడ్లు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

మురికివాడ వాసులకు అక్కడే ఇళ్ల నిర్మాణం

పద్దెనిమిదిచోట్ల వెండార్స్‌ జోన్లు

సెల్లార్‌లలో ఆక్రమణల తొలగింపునకు త్వరలో ఆపరేషన్‌ లంగ్స్‌-3.0

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కోసం జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు మే చివరి నాటికి పూర్తిచేస్తామని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం జీవీఎంసీ పరిధిలో ఏడు రహదారుల నిర్మాణం/విస్తరణ పనులు జరుగుతున్నట్టు చెప్పారు. వాటిలో వేపగుంట-పినగాడి, వేపగుంట-జుత్తాడ రోడ్లను జీవీఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వేపగుంట-జుత్తాడ రోడ్డులో వీఎంఆర్‌డీఏ, ఎండోమెంట్‌, డిఫెన్స్‌, ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌లకు సంబంధించిన భూములతోపాటు 229 ప్రైవేటు భూములు ఉన్నాయన్నారు. ప్రైవేటు భూముల్లో 205 మంది భూములు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. మిగిలిన అడ్డంకులను కూడా అధిగమించి మే చివరినాటికి రోడ్లను అందుబాటులోకి తెస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)లో భాగంగా స్లమ్‌ డెవలప్‌మెంట్‌ వర్క్‌ పేరుతో జీవీఎంసీ పరిధిలో ఉన్న 66 మురికివాడలను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ తయారుచేశామన్నారు. వీటిలో 50 మురికివాడలు రాష్ట్రప్రభుత్వానికి చెందిన భూమిలో ఉండగా, మిగిలిన పదహారు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూముల్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మురికివాడలను ముందుగా అభివృద్ధి చేసి, అక్కడ నివసించేవారికి అక్కడే అన్నిరకాల మౌలిక సదుపాయాలతో పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. జీవీఎంసీపై ఎలాంటి ఆర్థికభారం లేకుండా పీపీపీ విధానంలో నిర్మించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా వెలంపేట, దొండపర్తి ఇందిరానగర్‌ మురికివాడలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ తయారుచేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే వారం రోజుల్లో ఆర్‌ఎఫ్‌పీ, వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించామన్నారు. మిగిలిన మురికివాడలను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో పద్దెనిమిది వెండార్స్‌ జోన్‌లకు కౌన్సిల్‌లో అనుమతి తీసుకుని, మొదట మూడుచోట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు. వెండార్స్‌ జోన్‌ల ఏర్పాటు భారం జీవీఎంసీ, మెప్మా, లబ్ధిదారుడు సమానంగా మోయాల్సి ఉంటుందన్నారు.

నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందుల దృష్ట్యా సెల్లార్‌లు ఆక్రమణలను తొలగించేందుకు త్వరలోనే ‘ఆపరేషన్‌ లంగ్స్‌-3.0’కి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. కొన్నిచోట్ల మల్టీలెవల్‌ కార్‌పార్కింగ్‌లు ఏర్పాటుచేసే ఆలోచన ఉందన్నారు. ఐఎఫ్‌ఆర్‌ కోసం రూ.18.5 కోట్లతో పనులు చేస్తున్నామని, వాటిలో 90 శాతం పనులు శాశ్వతంగా ఉపయోగపడేవి ఉన్నాయన్నారు. రూ.172 కోట్ల కేంద్ర నిధులతో మూడుచోట్ల నిర్మిస్తున్న వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మార్చి నెలాఖరు నాటికి 50 శాతం పనులు పూర్తిచేస్తామన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 01:28 AM