Share News

శరవేగంగా సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 10:43 PM

మండలంలోని మర్ధగుడ చాపరాయి సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.

శరవేగంగా సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులు
ప్రాజెక్టు ముఖద్వారం వద్ద ఆర్చి

దాదాపు ఎనిమిది ఉడెన్‌ కాటేజీలు పూర్తి, నిర్మాణంలో మరో రెండు..

15లోగా అందుబాటులోకి తెచ్చేందుకు అటవీశాఖ చర్యలు

అనంతగిరి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్ధగుడ చాపరాయి సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేలా, చక్కని వసతి కల్పించేలా అటవీ శాఖాధికారులు ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. వచ్చే నెల 15వ తేదీలోగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్ధగుడ చాపరాయిని ఆనుకుని దట్టమైన అటవీ ప్రాంతంలో సీతాకోకచిలుక ప్రాజెక్టు ఉంది. 2022లో ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా సింహాద్రి ఎన్టీపీసీ సహకారంతో రూ.5.5 కోట్లతో అటవీ శాఖాధికారులు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ప్రారంభంలో పనులు శరవేగంగా జరిగినా ఆ తరువాత దాదాపు రెండేళ్లు వివిధ కారణాలతో పనులకు ఆటంకం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాఫీ హౌస్‌, ఎనిమిది ఉడెన్‌ కాటేజీలు, రాక్‌ఫిల్‌ డ్యామ్‌లు, గ్రావిటీ తాగునీటి పథకం, వాటర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం, ప్రాజెక్టు ముఖద్వారం వద్ద ఆర్చి, లోపల రహదారి పనులు జరిగాయి. చాపరాయిని ఆనుకుని రెస్టారెంట్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే మరో రెండు ఉడెన్‌ కాటేజీల పనులు జరుగుతున్నాయి. మర్ధగుడ వీఎస్‌ఎస్‌(వనసంరక్షణ సమితి)లో సుమారు 80 మంది సభ్యులు ఉన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తరువాత వీరికి ఉపాధి లభించనుంది. కాగా వచ్చే నెల 15వ తేదీలోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామని అనంతగిరి అటవీ రేంజర్‌ సుధీర్‌ తెలిపారు. ఇది అటవీశాఖకు ప్రత్యేక ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు విశేషాలు

- ఎకో కాటేజీలతో పాటు నాన్‌ టింబర్‌ ఫారెస్ట్‌ ప్రొడ్యూస్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

- ఓపెన్‌ బటర్‌ఫ్లై గార్డెన్‌, ఆర్కిడేరియం, ఔషధ మొక్కల వనం, వాచ్‌ టవర్‌, సీతాకోకచిలుకలకు మకరంధం కోసం పుష్పజాతుల పెంపకం చేపట్టనున్నారు.

- తూర్పు కనుముల్లోని జీవవైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు.

- సేంద్రీయ అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 10:44 PM