త్వరితగతిన అందుబాటులోకి సీతాకోకచిలుక ప్రాజెక్టు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:23 AM
మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.5.5 కోట్లతో చేపట్టిన సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) డాక్టర్ పీవీ చలపతిరావు ఆదేశించారు.
అధికారులకు పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు ఆదేశం
అనంతగిరి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మర్ధగుడ చాపరాయిని ఆనుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.5.5 కోట్లతో చేపట్టిన సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) డాక్టర్ పీవీ చలపతిరావు ఆదేశించారు. బుధవారం ఆయన సీతాకోకచిలుక ప్రాజెక్టు పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కాఫీతోటల మధ్యలో ఏకాంతమైన ప్రదేశంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అటవీశాఖకు ఈ ప్రాజెక్టు మంచి గుర్తింపు తెస్తుందని, పర్యాటకులు మరపురాని అనుభూతిని పొందుతారని ఆయన అన్నారు. అలాగే ప్రాజెక్టుతో పాటు భీసుపురం సమీపంలోని రక్తకొండకు ట్రెక్కింగ్ చేసుకుంటూ పర్యాటకులు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఫారెస్ట్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట సీసీఎఫ్ దివాన్‌మైదీన్, డీఎఫ్‌వో ఉమామహేశ్వరి, తదితరులు ఉన్నారు.