బడిలో సందడి
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:24 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆశాజనకంగా ప్రవేశాలు
ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5,172 మంది చేరిక
జిల్లాలో గత ఏడాది విద్యార్థుల సంఖ్య 68,040
ఈ ఏడాది ఇప్పటికి 68,405...
70,000 దాటుతారంటున్న విద్యా శాఖ అధికారులు
సర్కారు స్కూళ్లలో చేరేందుకు సిద్ధమైన నాలుగైదు వేల మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వని ప్రైవేటు పాఠశాలలు
ఆయా యాజమాన్యాలతో మాట్లాడుతున్న అధికారులు
విశాఖపట్నం, జూలై 3 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఇంకా ఆగస్టు వరకూ సమయం ఉందని, అందువల్ల విద్యార్థుల సంఖ్య గత ఏడాది కంటే అధికంగా ఉంటుందని విద్యా శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. గత ఏడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 68,040 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరం శుక్రవారం వరకు 68,405 మంది ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగ్గా, మరికొన్నిచోట్ల తగ్గారు. ఒకటో తరగతిలో ఇప్పటివరకూ 5,172 మంది ప్రవేశాలు పొందారు. సుమారు ఐదు వేల మంది విద్యార్థులు ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరారు. వాస్తవంగా వీరిలో చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరాల్సి ఉంది.
గత విద్యా సంవత్సరం గాజువాక మండలం కొండయ్యవలస ప్రాథమిక పాఠశాలలో 66 మంది ఉండగా, ప్రస్తుతం 90 మంది ఉన్నారు. అలాగే భీమిలి పట్టణంలోని రెండో వార్డు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 53 నుంచి 86కు, నగరంలోని రామ్‌నగర్ స్కూలులో 61 నుంచి 86కు, పద్మనాభం మండలం గంధవరంలో 52 నుంచి 72కు, ములగాడ ఎంహెచ్ కాలనీలోని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో 103 నుంచి 154కు పెరిగారు.
అయితే జిల్లాలో ఆనందపురం మండలం పందలపాక, జోడువానిపాలెం, పద్మనాభం మండలం ఏనుగువానిపాలెం, పెందుర్తి మండలం గోవిందపురం, బందవానిపాలెం ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఒక్కరు కూడా చేరలేదు. పెందుర్తి మండలం నరవవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో 26 మందిని చేర్పించాలన్నది లక్ష్యం కాగా శుక్రవారం వరకు కేవలం ఒక్కరు మాత్రమే చేరారు. దక్షిణ నియోజకవర్గంలోని మునిసిపల్ పోర్టు ఉర్దూ బాలికల పాఠశాలలో 55 మందిని చేర్పించాల్సి ఉండగా ఐదుగురు, భీమిలి మండలం చిననాగమయ్యపాలెంలో 12 మందికి ఒక్కరు, ఎక్కువ పిల్లలు చేరాల్సిన పాత గాజువాక ప్రాథమిక పాఠశాలలో 11 మంది, కొత్తగాజువాక పాఠశాలలో 22 మంది మాత్రమే చేరారు. మొత్తం 42 పాఠశాలల్లో విద్యాశాఖ నిర్దేశించిన దాని కంటే తక్కువ మంది చేరారు.
కాగా జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారు. మరికొన్నిచోట్ల స్వల్పంగా తగ్గారు. అడవివరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గత ఏడాది 454 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది 492కు పెరిగారు. అలాగే బక్కన్నపాలెం ఉన్నత పాఠశాలలో 286 నుంచి 334కు, చిన ఉప్పాడ హైస్కూల్‌లో 282 నుంచి 325కు, మధురవాడలోని సునీల్‌శర్మ కాలనీ ఉన్నత పాఠశాలలో 356 నుంచి 440కు, పెందుర్తి శాంతినగర్ ఉన్నత పాఠశాలలో 293 నుంచి 323కు, నడుపూరు స్కూలులో 1,682 నుంచి 1,790కి, పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1,170 నుంచి 1,291కు పెరిగారు. అయితే చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో గత ఏడాది మూడు వేల మందికిపైగా విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 2,900 మంది మాత్రమే ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనపై రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకువస్తున్నారు. అయితే టీసీలు ఇవ్వడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మొండికేస్తున్నాయి. విద్యార్థుల యూడైస్ కోడ్ నంబరుతో ఉన్న వివరాలను సంబంధిత ప్రైవేటు పాఠశాల నుంచి తొలగించి డ్రాప్ బాక్స్‌లో వేయాలి. దానిని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తీసుకుని ఆన్‌లైన్‌లో తమ పాఠశాలలో నమోదుచేయాలి. కానీ జిల్లాలో సుమారు నాలుగు నుంచి నాలుగున్నర వేల మంది విద్యార్థుల వివరాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డ్రాప్ బాక్స్‌లో వేయకుండా పెండింగ్‌లో పెట్టాయి. దీనిపై విద్యా శాఖ ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు టీసీలు ఇవ్వాలని సూచించింది. కాగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్యను 70 వేలు దాటుతుందని డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు.