సందడిగా తారుమారు సంత
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:33 PM
మండల కేంద్రంలో మంగళవారం జరిగిన తారుమారు సంతకు అధిక సంఖ్యలో గిరిజనులు వచ్చారు.
భారీగా తరలి వచ్చిన గిరిజనులు
జి.మాడుగుల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం జరిగిన తారుమారు సంతకు అధిక సంఖ్యలో గిరిజనులు వచ్చారు. స్థానిక మత్స్యరాస వెంకటరాజు ఘాట్ వద్ద జరిగిన ఈ సంత ప్రాంగణం కిటకిటలాడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా గిరిజనులు నూతన వస్త్రాలతో పాటు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. బెల్లం, కుండలు, చిరుధాన్యాలను ఆనవాయితీ ప్రకారం కొనుగోలు చేశారు. పాత సంప్రదాయం ప్రకారం జోరా (నమస్కారాలు) చెప్పుకుని పండుగ పిలుపులు పిలుచుకున్నారు. సంత కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పాడేరు- చింతపల్లి వెళ్లే వాహనాలను ఈదులబయలు నుంచి తహశీల్దార్ కార్యాలయం మీదుగా పోలీసులు మళ్లించారు. స్థానిక ఎస్‌ఐ సాయిరాం పడాల్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న మరోసారి తారుమారు సంత జరగనున్నది.