సాగరతీరంలో సందడి
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:33 AM
సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర జల రవాణా, ఓడ రేవుల మంత్రిత్వ శాఖ తలపెట్టిన ‘లైట్‌హౌస్ ఫెస్టివల్’ శుక్రవారం ఆర్కే బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్కులో అట్టహాసంగా ప్రారంభమైంది.
అట్టహాసంగా ప్రారంభమైన ‘లైట్‌హౌస్ ఫెస్టివల్’
విశాఖ బ్యూటిఫుల్...ఇక్కడి ప్రజలు డ్యూటీ ఫుల్
- మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
- షిప్ బిల్డింగ్ సెంటర్‌కు నేషనల్ హబ్‌గా మారనున్న నగరం
కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్
విశాఖ-చెన్నై మధ్య సెవెన్ స్టార్ క్రూయిజ్ సర్వీస్‌లు
రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్
విశాఖపట్నం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):
సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర జల రవాణా, ఓడ రేవుల మంత్రిత్వ శాఖ తలపెట్టిన ‘లైట్‌హౌస్ ఫెస్టివల్’ శుక్రవారం ఆర్కే బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్కులో అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటలకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత సంస్కృతికి దర్పణంగా లైట్‌హౌస్ ఫెస్టివల్ నిలుస్తుందన్నారు. విశాఖ బ్యూటిఫుల్ సిటీ అని, ఇక్కడి ప్రజలు డ్యూటీ ఫుల్ అని వ్యాఖ్యానించారు. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశాంతంగా ఉంటారని, అందరినీ ప్రేమిస్తారన్నారు. ఎవరి పని వారు చేసుకునే స్వభావంతో ఉంటారని, విశాఖ నగరాన్ని చూస్తే ప్రేమలో పడనివాళ్లు ఎవరూ ఉండరన్నారు. ఇదే ఊరిలో తాను చదివానని, ఇక్కడే 17 నెలలపాటు జైల్లో కూడా ఉన్నానన్నారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కార్నివల్, సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ షిప్ బిల్డింగ్‌కు విశాఖ నేషనల్ హబ్‌గా మారనుందన్నారు. విశాఖ అందమైన నగరమే కాదని, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లని, సౌమ్యులు కూడా అని పేర్కొన్నారు. అటువంటి విశాఖలో మూడో లైట్ హౌస్ ఫెస్టివల్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ పోర్టు ప్రపంచంలోనే టాప్ 20 పోర్టుల్లో ఒకటిగా ఉందన్నారు. 2047 నాటికి టాప్5లో ఒకటిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. అంతకుముందు ఆయన ప్రసంగాన్ని ‘నమస్కారం, శుభసాయంత్రం...’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెంపుల్, ఎకో, వెల్‌నెస్, అగ్రి, అడ్వంచర్ టూరిజంతోపాటు విశాఖ-చెన్నై మధ్య సెవెన్ స్టార్ క్రూయిజ్ సర్వీసులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
ఫెస్టివల్‌లో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించాయి. కూచిపూడితోపాటు తన్వి శర్మ నేతృత్వంలోని బృందం ప్రదర్శించిన ఉత్తరాది నృత్యకళారూపాలు అలరించాయి. అంకిత్ తివారీ ఆలపించిన పాటలు పర్యాటకులను మంత్రుముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫుడ్ కోర్టులు సందర్శకులతో కిటకిటలాడాయి.