పర్యాటకుల సందడి
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:13 PM
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. మన్యం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చారు.
చెరువులవేనం, సీలేరులోని ప్రకృతి అందాలకు ఫిదా
చింతపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. మన్యం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వచ్చారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల గిరిజన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శనివారం నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. ఒక్కసారిగా గిరిజన ప్రాంతంలో శీతాకాల వాతావరణం కనిపిస్తున్నది. ఉదయం వేళల్లో మంచు కురుస్తున్నది. దీంతో లంబసింగి పరిసర ప్రాంతాల ప్రకృతి అందాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం లంబసింగి ప్రకృతిని ఆస్వాదించేందుకు అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ పరిసరాల్లో సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. అలాగే తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడలు జిప్‌లైన్, బోటింగ్ అందుబాటులో లేకపోవడం వల్ల పర్యాటకులు నిరాశ చెందారు. యర్రవరం జలపాతాన్ని సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.
సీలేరులో...
సీలేరు: జీకే వీధి మండలం సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం వద్ద ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు సందడి చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రస్తుతం సీలేరు ఐస్‌గెడ్డ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. 100 అడుగుల ఎత్తు నుంచి కిందకు పాల నురగ వలె ఉరకలేస్తుండడంతో ఈ జలపాతం అందాలను చూసేందుకు స్థానికులు, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పలువురు పర్యాటకులు ఉదయం నుంచే ఇక్కడికి చేరుకున్నారు. జలపాతం వద్ద జలకాలాడుతూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు.
బొర్రా గుహల వద్ద..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు ఆదివారం పర్యాటకులు తాకిడి పెరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు వస్తున్నారు. ఆదివారం బొర్రా గుహలను 1,400 మంది సందర్శించగా, రూ.లక్షా 6 వేల వరకు ఆదాయం సమాకూరింది. తాటిగుడ, కటికి, సరియా జలపాతాల వద్ద పర్యాటకులు సందడి చేశారు. అలాగే కాఫీ ప్లాంటేషన్, డముకు వ్యూపాయింట్ వద్ద పర్యాటకుల కోలాహలం కనిపించింది.