పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:07 AM
ఏజెన్సీలో పర్యాటకులు సందడి చేశారు. ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకులు వస్తున్నారు. ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.
లంబసింగి, అరకులోయలో కోలాహలం
చింతపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో పర్యాటకులు సందడి చేశారు. ప్రస్తుతం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పర్యాటకులు వస్తున్నారు. ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పొగమంచు సోయగాలను కెమెరాల్లో బంధించారు. అలాగే తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొనేందుకు పలువురు ఆసక్తి చూపారు.
అరకులోయలో...
అరకులోయ: స్థానిక పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు, గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో ఉన్న ఉడెన్ బ్రిడ్జి వద్ద ఆదివారం సందర్శకుల సందడి కనిపించింది. పర్యాటకుల రాకతో హోటళ్లు, లాడ్జీలు, రిసార్టులు కళకళలాడాయి.
డుంబ్రిగుడలో..
డుంబ్రిగుడ: స్థానిక పర్యాటక ప్రాంతమైన చాపరాయి జల విహారి, అరకు పైనరీ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. చాపరాయి జల విహారిలో పర్యాటకులు కుటుంబ సమేతంగా సరదాగా గడిపారు. అనంతరం అరకు పైనరీలో ఫొటోలు దిగుతూ సందడి చేశారు.