పర్యాటక ప్రాంతాల్లో సందడి
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:27 PM
మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.
సంక్రాంతి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో తరలి వచ్చిన పర్యాటకులు
అరకులోయ, లంబసింగి, కొత్తపల్లి జలపాతం వద్ద కోలాహలం
పాడేరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల కోలాహలం కనిపించింది.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువులవేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.
అరకులోయలో...
అరకులోయ: వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అరకులోయలోని పర్యాటక ప్రాంతాలను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. వేకువజామున మంచు, ఆ తరువాత చిరుజల్లులు పడడంతో వాతావరణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేశారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, సుంకరమెట్ట ఉడెన్‌బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌ను పర్యాటకులు సందర్శించారు. ఉదయం 11 గంటల సమయంలో ఉడెన్‌బ్రిడ్జి వద్ద, సుంకరమెట్ట సంత వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో యథావిధిగా రాకపోకలు సాగాయి.
వంజంగి మేఘాల కొండపై..
పాడేరురూరల్: మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మేఘాల కొండను పర్యాటకులు సందర్శించి మంచు మేఘాలను తిలకించి మైమరిచిపోయారు. మేఘాల కొండను ఆదివారం 1,001 మంది పర్యాటకులు సందర్శించగా, రూ.55,050 ఆదాయం వచ్చిందని ఎకో టూరిజం నిర్వాహకులు తెలిపారు.
బొర్రా గుహలకు..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం 5,500 మంది పర్యాటకులు గుహలను సందర్శించగా, రూ.4.88 లక్షల ఆదాయం సమకూరిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. అలాగే కాఫీ ప్లాంటేషన్, డముకు వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు సందడి చేశారు.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిని అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. అయితే శనివారం రాత్రి వర్షం పడడంతో వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశం మేఘావృతంగా ఉండడం వల్ల మంచు అందాలు పెద్దగా కనిపించలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద వేచి ఉండి మంచు అందాలు పెద్దగా కనిపించకపోవడంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి వెనుదిరిగారు. తాజంగి జలాశయం వద్ద బోటింగ్, సాహస క్రీడల్లో పాల్గొనేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. స్ట్రాబెర్రీ తోటల్లోనూ పర్యాటకులు సందడి చేశారు. యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి.
కొత్తపల్లి జలపాతం వద్ద...
జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ పర్యాటకులు ఏమాత్రం తగ్గకుండా జలపాతాన్ని సందర్శించారు. కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. కాగా గుర్రాయి జలపాతాన్ని సైతం పర్యాటకులు సందర్శించారు.