Share News

పల్లెల్లో సందడి

ABN , Publish Date - Nov 24 , 2026 | 12:38 AM

జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

పల్లెల్లో సందడి
పాడేరు మండలం కిండంగి పంచాయతీలో కూటమి శ్రేణుల హడావిడి

నామినేషన్ల పర్వం ముగియడంతో జోరుగా ప్రచారాలు

సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తిస్తున్న అభ్యర్థులు

పంచాయతీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు

జిల్లాలో 244 పంచాయతీలు, 2446 వార్డులు, 4,98,467 మంది ఓటర్లు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని మొత్తం 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు ఈ నెల 26న, 29న, డిసెంబరు 2న మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఎవరెవరు ఎన్నికల బరిలో ఉంటారనేది దాదాపుగా ఖరారు కావడంతో ప్రచారాలు జోరందుకున్నాయి. పలు చోట్ల ప్రచారం హడావిడి కనిపిస్తుండగా, మరికొన్ని చోట్ల చాపకింద నీరులా రహస్యంగా కొనసాగుతున్నది.

మైదాన ప్రాంతానికి భిన్నంగా ఏజెన్సీలో సామాజిక వర్గాల సమీకరణలే ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన్యంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన గిరిజన ఓటర్లు మాత్రమే ఉండడంతో వాళ్లు ఆయా సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతుంటారు. దీంతో తాము పోటీ చేస్తున్న పంచాయతీల్లో తమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఏ ప్రాంతంలో చూసినా వారి సామాజిక వర్గాలతో సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థుల భేటీలు, మంతనాలు జోరుగా సాగుతున్నాయి.

బీఫారాలు లేనప్పటికీ రాజకీయ పార్టీలు ఆధారం

పరిషత్‌ ఎన్నికల్లో వలే అభ్యర్థులకు రాజకీయ పార్టీల బీఫారాల నిబంధనలు లేనప్పటికీ, మొత్తం ఎన్నికల వ్యవహారం మాత్రం రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే జరుగుతుండడం విశేషం. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులకు పార్టీ గుర్తులు లేకపోయినా, ఆయా రాజకీయ పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగుతున్నారు. అలాగే పార్టీల నేతలు, కార్యకర్తలు సైతం తమ మద్దతుతోనే సర్పంచ్‌, వార్డు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించుతున్నామని గ్రామాల్లో ప్రచారాలు సాగిస్తున్నారు. దీంతో బీఫారాల ఊసు లేనప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో సైతం రాజకీయ సమీకరణ ఆధారంగానే అభ్యర్థుల విజయావకాశాలుండే పరిస్థితి నెలకొంది.

మన్యంలో ఏకగ్రీవాలు అరుదు

ఏజెన్సీలో ఎటువంటి ఎన్నికల్లోనైనా ఏకగ్రీవాలకు గిరిజనులు ఆసక్తి చూపరు. అభ్యర్థులకు చెందిన కుటుంబీలు, బంధువులు అధికంగా ఉండడంతో ఏదో విధంగా గెలుస్తామనే ధీమాతో పోటీకే సై అంటారు. అందువలనే ఏజెన్సీలో పరిషత్‌ ఎన్నికల్లో ఒక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానం సైతం ఏకగ్రీవం కాలేదు. దాదాపుగా పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. జిల్లాలో కొయ్యూరు మండలం బాలారం పంచాయతీలో పలు భిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే ఈ ఒక్క పంచాయతీ ఏకగ్రీవమైంది. ఏజెన్సీలో ప్రతి సర్పంచ్‌ స్థానానికి 5 నుంచి 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డులకు సగటున ముగ్గురు చొప్పున ఎన్నికల బరిలో ఉన్నారు. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో మొత్తం 65 పంచాయతీలకు గాను సర్పంచ్‌ స్థానాలకు 268 మంది పోటీ పడుతుండగా, 553 వార్డులకు 1,330 మంది పోటీ చేస్తున్నారు. అలాగే రెండో విడతలోని పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లోని 87 పంచాయతీలకు సర్పంచ్‌ స్థానాలకు 693 మంది, 880 వార్డులకు 1,793 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మూడో విడతలోని పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని 91 పంచాయతీలకు సర్పంచ్‌ స్థానాలకు 734, అలాగే 880 వార్డులకు 2,054 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ పోటీ చూస్తుంటే మన్యంలో రాజకీయ వేడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Nov 24 , 2026 | 12:38 AM