సచివాలయాల్లో సందడి
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:48 AM
అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం సచివాలయాల్లో సందడి నెలకొంది. దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలియడంతో పెద సంఖ్యలో ఆశావహులు సచివాలయాలకు తరలి రావడంతో కోలాహలంగా మారింది.
కొత్త పెన్షన్లకు భారీగా దరఖాస్తులు
16 వరకు గడువు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం సచివాలయాల్లో సందడి నెలకొంది. దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తెలియడంతో పెద సంఖ్యలో ఆశావహులు సచివాలయాలకు తరలి రావడంతో కోలాహలంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ల సొమ్మును పెంచి అందిస్తుండడంతో దరఖా స్తులు చేసేందుకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు పెన్షన్ల కోసం ఈనెల 16వ తేదీలోగా దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో సోమవారం నుంచి గ్రామ సచివాలయాల్లో పెన్షన్ల ఆశావహులతో సందడి వాతావరణం నెలకొంది. సుమారు రెండున్నరేళ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు సువర్ణావకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 11 మండలాల్లో 73,079 మంది ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల లబ్ధిదారులున్నారు.
ఇతర శాఖల సమన్వయం అవసరం
ప్రస్తుతం కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన తరుణంలో అవసరమైన కుల, ఆదాయ, దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల జారీకి ఇతర శాఖల సమన్వయం అవసరమని ఆశావహులు అంటున్నారు. అర్హులకు అన్యాయం జరగకుండా పెన్షన్లను పొందేందుకు అవసరమైన తోడ్పాటును ఆ శాఖలకు చెందిన అధికారులు అందించాలని పలువురు కోరుతున్నారు. ఈక్రమంలో ఆశావహులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఎంతో ఆనందంగా ఉంది..
- బి.మాధవరావు, కాడెలి, పాడేరు మండలం
నాకు ప్రస్తుతం 60 ఏళ్లు దాటిపోయాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాను. కొత్త పెన్షన్‌కు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. ఈరోజు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. పెన్షన్ సొమ్ము రూ.4 వేలు చేయడంతో భవిష్యత్‌లో నాకు పెన్షన్ భరోసా ఉంటుందని భావిస్తున్నాను.
వితంతు పెన్షన్ ఆసరా కానుంది..
-సాలేబు భారతి, కాడెలి, పాడేరు మండలం
నా భర్త మృతి చెందడంతో ఇకపై వచ్చే వితంతు పెన్షనే ఆసరాగా ఉంటుంది. పెన్షన్ పొందేందుకు దరఖాస్తు చేశాను. ప్రభుత్వం తాజా నిర్ణయంతో నాలాంటి ఎందరో నిస్సహాయులకు భరోసా కలగనుంది. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ నాకు జీవనాధారం కానుంది.