Share News

రూ.4వేల కోట్ల వ్యాపార లక్ష్యం

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:55 AM

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించి రుణాల మంజూరు, డిపాజిట్ల సేకరణ చేపడుతున్నామని జిల్లా కేంద్ర సహకారబ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు.

రూ.4వేల కోట్ల వ్యాపార లక్ష్యం

వర్షాభావంతో తగ్గిన పంట రుణాలు

రుణం తీసుకున్న రైతుల పంటకు బీమా

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు

విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.4,000 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించి రుణాల మంజూరు, డిపాజిట్ల సేకరణ చేపడుతున్నామని జిల్లా కేంద్ర సహకారబ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,958 కోట్ల వ్యాపారం చేశామన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో మాట్లాడుతూ 2024-25తో పోల్చితే గత ఆర్ధిక సంవత్సరంలో 18.9 శాతం వృద్ధి సాధించి రాష్ట్రంలో అన్ని డీసీసీబీల కంటే విశాఖ డీసీసీబీ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ వృద్ధి సాధించలేదని ఇందుకు జాతీయ సహకార బ్యాంకు నుంచి అవార్డు రావాల్సి ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చేసిన వ్యాపారంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.1,100 కోట్లు అదనంగా చేయాలని ప్రతిపాదించామని, ఇప్పటి వరకు రూ.3,100 కోట్లు వ్యాపారం చేశామన్నారు. బంగారు ఆభరణాలపై ఇప్పటికే రూ.650 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. స్వల్పకాలిక పంట రుణాల కింద రూ.378 కోట్లు రుణాలు మంజూరు లక్ష్యంగా నిర్ణయిస్తే ఇంతవరకు రూ.234 కోట్లు ఇచ్చామన్నారు. గత ఏడాది ఇదే కాలానికి రూ.278 కోట్లు ఇచ్చామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభాం కొనసాగుతున్నందున రైతులందరూ రుణాలు తీసుకునేందుకు ముందుకురావడంలేదన్నారు. డీసీసీబీ పరిధిలో 4.5 లక్షలమంది సభ్యులు ఉండగా వీరిలో 80 వేల మంది రైతులు ఎక్కువగా రుణాలు తీసుకుంటారన్నారు. రుణం తీసుకునే ప్రతి రైతుకు పంటల బీమా చేస్తామన్నారు. ఇప్పటి వరకు 80 వేల మందిలో 86శాతం మంది రైతులు రుణం తీసుకున్నందున వారికి పంటల బీమా వర్తింపజేశామని కోన తాతారావు తెలిపారు.


కబళించిన మృత్యువు

స్కూటీని ఢీకొట్టిన లారీ

ఇద్దరు దుర్మరణం

స్టీల్‌సిటీ డిపో సమీపంలో సంఘటన

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

ఉద్యోగాన్వేషణలో ఉన్న మేనల్లుడ్ని వీఎస్‌ఈజెడ్‌లోని పరిశ్రమలో పని నేర్పించేందుకు తీసుకువెళ్తుండగా మృత్యువు కబళించింది. సరదాగా మాట్లాడుకుంటూ స్కూటీపై బయలుదేరిన వారిని వెనుకనుంచి బలంగా ఢీకొట్టిన లారీ తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. ఈ ఘోర సంఘటన ఆదివారం కూర్మన్నపాలెం ఆర్టీసీ స్టీల్‌సిటీ డిపో సమీపంలో జరిగింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెట్టా రవికుమార్‌ (46), భార్య సునీత (ఈమె రాంబిల్లి మండలం దరిపూడిలో ప్రభుత్వ పాఠశాలఉపాధ్యాయిని), కుమారుడు రాహుల్‌ భరత్‌కృష్ణ, కుమార్తె గంగా సింధూలతో కలిసి జీవీఎంసీ 71 వార్డు శ్రీనగర్‌లో నివాసముంటున్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గయ్యపేట మం డలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన రవికుమార్‌ మేనల్లుడు పడాల సుధావెంకట్‌ (17) ఐటీఐ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో భాగంగా నాలుగు రోజుల కిందట మామయ్య రవికుమార్‌ ఇంటికి వచ్చాడు. వీఎస్‌ఈజెడ్‌లో పనినేర్చుకొనేందుకు వీలుగా ఆదివారం ఉదయం రవి కుమార్‌, సుధా వెంకట్‌ శ్రీనగర్‌ నుంచి వీఎస్‌ఈజెడ్‌కు స్కూటీపై బయలుదేరారు. కూర్మన్నపాలెం సమీపంలోని ఆర్టీసీ స్టీల్‌సిటీ డిపో సమీపానికి చేరేసరికి అతివేగంగా వచ్చిన లారీ స్కూటీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు రోడ్డుకు ఎడమవైపు పడిపోయారు. దీంతో లారీ చక్రాలు వారి మీదుగా దూసుకుపోయి, కొంతదూరం ఈడ్చుకుపోయాయి. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకు దువ్వాడ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా లారీని నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ తోట శ్రీనును అదుపులోకి తీసుకుని, లారీని సీజ్‌ చేశారు. రవికుమార్‌ భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏడీసీపీ పరిశీలన...

ఘటనా స్థలాన్ని ట్రాఫిక్‌ ఏడీసీపీ నరసింహమూర్తి, ట్రాఫిక్‌ ఏసీపీ భవ్యారెడ్డి, దువ్వాడ ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ సందర్శించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు.


ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా సింహాచలం నాయుడు

శ్యామ్‌బాబుకు సీజీఎంగా పదోన్నతి

విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

ఈపీడీసీఎస్‌ఎల్‌ లో పలువురికి పదోన్నతులు లభించాయి. ఆ మేరకు పోస్టింగ్‌లు ఇచ్చారు. విశాఖపట్నం సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న శ్యామ్‌బాబుకు పదోన్నతి కల్పించి చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. మధురవాడ జోన్‌-3 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బి.సింహాచలం నాయుడుకు పదోన్నతి కల్పించి శ్యామ్‌బాబు స్థానంలో విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈగా నియమించారు. వినాయకచవితి సెలవు ముగిసిన వెంటనే సింహాచలం నాయుడు బాధ్యతలు తీసుకుంటారు.


నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

వినాయకచవితి పండుగ సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, జీవీఎంసలో నిర్వహించాల్సిన ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమం రద్దుచేసినట్టు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌, సీపీ, జీవీఎంసీ కమిషనర్‌ తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించి సహకరించాలని కోరారు. వచ్చే వారం యథావిధిగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.


22న జడ్పీ సర్వసభ్య సమావేశం

విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈనెల 22న చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరగనున్నది. జడ్పీ పాలకవర్గం పదవీకాలం ఈనెల 24వతేదీతో ముగుస్తుంది. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వశాఖలపై చర్చించే అవకాశం ఉంది. కాగా జడ్పీ పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్నందున జడ్పీటీసీ సభ్యులను సత్కరించనున్నారు.

Updated Date - Sep 14 , 2026 | 12:55 AM