ఉత్సవాల పేరుతో వ్యాపారం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:05 AM
వినాయక చవితి వచ్చిదంటే భారీ, వినూత్న విగ్రహాల పేరుతో వ్యాపారం చేసేవారు నగరంలో ఎక్కువయ్యారు.
గాజువాకలో వినాయక విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంగణంలో దుకాణాలు ఏర్పాటు
ఇంకా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు పేరుతో డబ్బులు వసూలు
ఇప్పుడు డజను గాజులు రూ.50కు ప్రసాదం కింద విక్రయించబోతున్నట్టు ప్రకటనలు
బీచ్‌రోడ్డులోనూ అంతే
ఒక్కో రుద్రాక్ష రూ.50కు అమ్ముతామంటూ ప్రచారం
పసుపు కొమ్ములు, ఖర్జూరతో ఏర్పాటుచేసినచోట్ల కూడా అదే తీరు
పట్టించుకోని అధికారులు, నాయకులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వినాయక చవితి వచ్చిదంటే భారీ, వినూత్న విగ్రహాల పేరుతో వ్యాపారం చేసేవారు నగరంలో ఎక్కువయ్యారు. అందులో గాజువాక గణేశ్ ఉత్సవ కమిటీ, యూత్ ఐకాన్ కమిటీలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. కేవలం ఒక్క ఈ ఉత్సవం ద్వారానే నెల రోజుల్లో కోటి రూపాయలకు తక్కువ లేకుండా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి.
గాజువాక శ్రీనగర్‌లో కోటి గాజులతో అతి పెద్ద వినాయకుడిని ఏర్పాటుచేశామని వారు ప్రచారం చేసుకుంటున్నారు. భక్తులు రోజూ వేల సంఖ్యలో వస్తున్నారు. పోలీసులు ఈ మండపంలో ఒక్క వినాయక విగ్రహానికి తప్పితే మిగిలిన వాటికి అనుమతులు ఇవ్వలేదు. ఉచిత దర్శనాలు కల్పించాలని నిబంధన పెట్టడంతో అలాగే చేస్తున్నారు. కానీ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాల పేరుతో దండుకుంటున్నారు. అదేవిధంగా యమలోకం, డైనోసార్ పార్క్ వంటివి ఏర్పాటుచేసి రూ.100 టికెట్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చిన్నచిన్న స్టాళ్లు తొలగించిన జీవీఎంసీ అధికారులు, సోమవారం యమలోకం సెట్ తొలగించారు. ఇదిలావుండగా నిర్వాహకులు సోషల్ మీడియాలో కొత్త ప్రచారం ప్రారంభించారు. 21 రోజుల తరువాత స్వామిని నిమజ్జనం చేస్తామని, అప్పుడు అలంకరించిన కోటి గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని చెబుతున్నారు. డజను గాజులకు రూ.50 చెల్లిస్తే చాలని పేర్కొంటున్నారు. కోటి గాజులు అంటే సుమారు 8 లక్షల డజన్లు. డజను రూ.50 చొప్పున అమ్మితే అక్షరాలా నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందులో కనీసం సగం మొత్తం వచ్చినా రూ.రెండు కోట్లు. తాము ఎవరి నుంచి చందాలు తీసుకోలేదని, బ్యాంకులో బంగారం తనఖా పెట్టి రూ.70 లక్షలతో ఉత్సవం చేస్తున్నామని నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఖర్చులు పోను నెల రోజుల్లో ఈ ఉత్సవం ద్వారా కనీసం కోటి రూపాయలు సంపాదించడానికి ప్లాన్ చేశారు.
బీచ్‌రోడ్డులో కోటి రుద్రాక్షలు అంతే...
ఆర్కే బీచ్ రోడ్డులో నోవాటెల్ హోటల్ సమీపాన గోకుల్ పార్కులో ‘యూత్ ఐకాన్’ కమిటీ పేరుతో ఈ ఏడాది కోటి రుద్రాక్షలతో వినాయకుడి ప్రతిమ ఏర్పాటుచేశారు. వీరు అదే ప్రాంగణంలో విశాఖ ఉత్సవ్‌లో ఫుడ్ స్టాళ్లు పెట్టినట్టు 20 వరకు దుకాణాలు పెట్టి ఫాస్ట్‌ఫుడ్స్ విక్రయిస్తున్నారు. భారీ వ్యాపారం జరుగుతోంది. తాజాగా పిల్లలకు వివిధ రైడ్లు పెట్టారు. ఇక్కడ కూడా ఉత్సవ నిమజ్జనం ద్వారా ఒక్కో రుద్రాక్షను ప్రసాదంగా రూ.50కు విక్రయిస్తామని ప్రచారం చేస్తున్నారు. అంటే కోటి రుద్రాక్షలు అమ్ముడుపోతే రూ.50 కోట్ల ఆదాయం. వీధుల్లో ఈవెంట్లు చేసుకునే యువకులు గ్రూపులుగా విడిపోయి భారీ, కొత్త తరహా విగ్రహాల పేరుతో భక్తులను ఆకర్షించి వ్యాపారాలు చేస్తున్నారు. వీరికి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారు సహకరిస్తున్నారు. ఆయా నాయకుల ఫ్లెక్సీలు పెట్టి అఽదికారులు ఒత్తిళ్లు తేకుండా చూసుకుంటున్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో ఇదే విధంగా పసుపు కొమ్ముల గణపతి, ఖర్జూరాల గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారు కూడా ఈ విధంగానే వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉత్సవం ముగియగానే విగ్రహాలను తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. కానీ వీరు అలా కాకుండా వ్యాపారం కోసం వాటిని ఉపయోగించుకుంటున్నారు. హిందూ సంఘాలు, అధికారులు కలిసి భక్తి పేరుతో వ్యాపారం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.