Share News

ఆగని బస్సులు!

ABN , Publish Date - May 12 , 2026 | 01:31 AM

‘స్ర్తీశక్తి’ పథకం అమలు తరువాత ఆర్టీసీ సిబ్బంది పనితీరుపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి.

ఆగని బస్సులు!

వెనుక ప్రయాణికుల పరుగులు

కొందరు డ్రైవర్లు, కండక్టర్ల తీరుతో సంస్థకు, ప్రభుత్వానికీ చెడ్డ పేరు

ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘స్ర్తీశక్తి’ పథకం అమలు తరువాత ఆర్టీసీ సిబ్బంది పనితీరుపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ అధికారులు ఉన్న వనరులను ఉపయోగించుకొని రెట్టింపు సేవలు అందిస్తున్నారు. కానీ కొందరి దుందుడుకు చర్యల వల్ల అవి ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్నాయి. గత ఏడాది ఆగస్టుకు ముందు ఒక్కో బస్సులో సగటున రోజుకు 359 మంది ప్రయాణిస్తే...ఇప్పుడే అదే బస్సులో 606 మంది వెళుతున్నారు. ఇదంతా ‘స్ర్తీశక్తి’ పథకం మహిమే. ఇంత మందిని చేరవేస్తున్నందుకు ఆర్టీసీ సిబ్బందికి ప్రశంసలు లభించాల్సింది పోయి విమర్శలు ఎదురవుతున్నాయి.

కొందరి వల్లే చెడ్డపేరు

కొంతమంది డ్రైవర్లు, కండక్టర్ల వల్ల ఇటు ఆర్టీసీకి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తోంది. కొంతమంది డ్రైవర్లు బస్టాపుల్లో మహిళలు కనిపిస్తే బస్సులు ఆపకుండా లాగించేస్తున్నారు. కొన్ని స్టాపుల్లో బస్సు ఆపినా...కండక్టర్‌ డోర్‌కు అడ్డంగా నిలబడి లోపల సీట్లు లేవని, నిలబడడానికి కూడా చోటు లేదని, వెనుక ఇంకా బస్సులు వస్తున్నాయని, వాటిలో ఎక్కాలని సూచిస్తున్నారు. ప్రయాణికులసు ఎక్కించుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటివి శ్రీకాకుళం, సాలూరు, పార్వతీపురం వైపు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సిటీ బస్సుల రూటే వేరు

సిటీ బస్సుల పరిస్థితి అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే ఉంది. పది బస్సుల్లో ఇద్దరో ముగ్గురో డ్రైవర్లు మాత్రమే బస్టాపుల్లో బస్సులను ఆపుతున్నారు. మిగిలిన వారంతా స్టాపునకు దూరంగా రోడ్డు మధ్యలో అలా..మూడు నాలుగు సెకండ్లు ఆపి వెంటనే లాగించేస్తున్నారు. అక్కడ దిగేవారి కోసం మాత్రమే ఆపామని, ఎవరూ ఎక్కడానికి వీల్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

- విజయనగరం నుంచి కూర్మన్నపాలెం వెళ్లే 111వి బస్సులను ఇలాగే నడుపుతున్నారు. నిర్దేశించిన స్టాపుల్లో ఆపడం లేదు. ఎక్కడానికి ప్రయాణికులు యత్నిస్తున్నా ఆపకుండా లాగించేస్తున్నారు.

- గురుద్వారా నుంచి జాతీయ రహదారిపై వచ్చే బస్సుల్లో 70 శాతం అక్కయ్యపాలెం బస్టాపులో ఆపడం లేదు.

- సిటీ నుంచి మధురవాడ వెళ్లే మార్గంలో ఎండాడ బస్టాపు వద్ద కూడా చాలా బస్సులు ఆపడం లేదు.

- కారు షెడ్‌ జంక్షన్‌ దాటిన తరువాత హైవేపై శిల్పారామం ముందు బస్టాపు ఉంది. అక్కడ ఎప్పుడూ కనీసం 20 మంది నిల్చొని ఉంటారు. అక్కడ కూడా చాలా బస్సులు ఆపడం లేదు.

- మద్దిలపాలెం నుంచి హనుమంతవాక వైపు వెళ్లే బస్సులు ఇసుకతోట బస్టాపు వద్ద ఆపాలంటే...ముందు జంక్షన్‌లో రెడ్‌ సిగ్నల్‌ ఉండాలి. పొరపాటున అక్కడ గ్రీన్‌ సిగ్నల్‌ ఉంటే...ఏ బస్సు ఆగకుండా వెళ్లిపోతుంది.

ఎక్కువ మొత్తం వెచ్చించి ప్రయాణం

బస్సు డ్రైవర్ల నిర్వాకం వల్ల చాలామంది ప్రయాణికులు మధురవాడ, కొమ్మాది తదితర ప్రాంతాల్లో బస్సుల కోసం ఎదురుచూసి ప్రయోజనం లేదని, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు వెళ్లడానికి మాక్సీ క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. వారు రెట్టింపు మొత్తం తీసుకుంటున్నారు. కొందరైతే విజయనగరం వరకు ఆటోల్లోనే వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించాల్సి ఉంది.


పెరిగిన ప్రయాణికులు, తగ్గిన బస్సులు!

ద్వారకా నగర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత ఏడాది అగస్టు 15వ తేదీ నాటికి ‘స్త్రీశక్తి’ పథకం అమలుకు ముందు మొత్తం 780 బస్సులు ఉండేవి. ఇవి రోజువారీ సగటున 2.8 లక్షల మందికి ప్రయాణికులకు సేవలందించేవి. ఒక్కో బస్సు సగటున ఒకరోజులో 359 మంది ప్రయాణికులకు గమ్యం చేర్చేది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకూ రీజియన్‌లో 40 బస్సులకు కాలం చెల్లడంతో విజయనగరంలోని సెంట్రల్‌ గ్యారేజీ తరలించారు. కాలపరిమితి ముగియడంతో మరో 12 అద్దె బస్సులను ఆపేశారు. ఇలా వివిధ కారణాల వల్ల మొత్తం 70 బస్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 710 బస్సులు ప్రయాణికులకు రవాణా సేవలందిస్తున్నాయి. ఈ 710 బస్సులు రోజువారీ సగటున 4.3 లక్షల మందికి రవాణా సేవలందిస్తున్నాయి. ఒక్కో బస్సు ఒకరోజులో 606 మందిని గమ్యానికి చేరుస్తోంది. ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్టు బస్సులు లేకపోవడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎలక్ర్టిక్‌ బస్సుల కోసం ఎదురుచూపు

ఎలక్ర్టిక్‌ బస్సుల ఎప్పుడు వస్తాయా అని ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు ఎదురు చూస్తున్నారు. అవి వస్తే ప్రస్తుతం ఉన్న బస్సులకు కొంతమేర తాకిడి తగ్గుతుందంటున్నారు.

Updated Date - May 12 , 2026 | 01:31 AM