Share News

బెంగళూరుకు బస్సులే దిక్కు

ABN , Publish Date - May 01 , 2026 | 02:09 AM

‘విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలులో ఎంతసేపటిలో వెళతారో ఊహించి చెప్పండి...చెన్నైకు ఎంత టైమ్‌ పడుతుందో ఊహించండి’ అంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రెండు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చినప్పుడు బుల్లెట్‌ రైళ్ల గురించి మాట్లాడారు.

బెంగళూరుకు బస్సులే దిక్కు

  • నగరం నుంచి రోజుకు 40...

  • విశాఖ నుంచి ఒక్క రైలూ లేదు

  • ఎప్పటినుంచో నడుస్తున్న ‘ప్రశాంతి’ ఎక్స్‌ప్రెస్‌ను కూడా భువనేశ్వర్‌కు పట్టుకుపోయారు

  • ప్రస్తుతం వారానికి ఒక స్పెషల్‌ రైలే

  • ప్రజా ప్రతినిధులకు పట్టదెందుకో...?

  • కనీసం ఒక హైస్పీడ్‌ రైలు, వందేభారత్‌ (స్లీపర్‌) అయినా నడపాలని ప్రయాణికుల నుంచి డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్‌ రైలులో ఎంతసేపటిలో వెళతారో ఊహించి చెప్పండి...చెన్నైకు ఎంత టైమ్‌ పడుతుందో ఊహించండి’ అంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రెండు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చినప్పుడు బుల్లెట్‌ రైళ్ల గురించి మాట్లాడారు. కానీ విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్లడానికి నేరుగా ఒక్క సాధారణ రైలు కూడా లేదు. ఆ విషయం విస్మరించారు. ప్రజా ప్రతినిధులు కూడా ఎవరూ గుర్తుచేయలేదు. డిమాండ్‌ చేయలేదు.

విశాఖపట్నంలో చదువుకొని ఇతర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు బెంగళూరులో పనిచేస్తున్నారు. ఇప్పుడు హైబ్రిడ్‌ మోడల్‌ పని విధానం నడుస్తోంది. నెలలో మూడు వారాలు వర్క్‌ ఫ్రమ్‌ చేస్తే, మరో వారం ఆఫీసుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో చాలామంది ఉద్యోగులు సొంత ఊళ్లోనే ఫ్యామిలీ పెట్టి, నెలకు ఒకసారి బెంగళూరు వెళ్లి వస్తున్నారు. అంటే ప్రతి ఉద్యోగి నెలకు ఒకసారి బెంగళూరు వెళ్లాల్సి వస్తోంది. కొత్త జంటలైతే భార్యభర్త ఇద్దరూ కలిసి వెళుతున్నారు. ఈ క్రమంలో గతం కంటే ఇప్పుడు విశాఖ నుంచి బెంగళూరుకు ప్రయాణం చేసే వారి సంఖ్య పెరిగింది. అది ఎంతలా అంటే...వీరి కోసం ప్రైవేటు ట్రావెల్స్‌ విశాఖ నుంచి రోజుకు 40 బస్సులు నడుపుతున్నాయి. ప్రయాణ సమయం 18 గంటలతో మొదలై 22 గంటల వరకూ ఉంటోంది. టికెట్‌ ధర రూ.2,200 నుంచి రూ.4 వేల వరకు ఉంది. అన్నీ ఏసీ బస్సులే. ఇంచుమించు అన్నీ స్లీపర్లే.

ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కూడా తగినన్ని రైళ్లు నడపాల్సి ఉంది. కానీ విశాఖలో మొదలై బెంగళూరు వెళ్లే రైలు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. రాష్ట్ర ఆర్థిక రాజధాని అని, పర్యాటక కేంద్రమని, ఐటీ హబ్‌ అని రకరకాల పేర్లతో పిలుస్తూ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నా రైల్వే అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ విశాఖ నుంచే నడిచేది. దానిని భువనేశ్వర్‌కు తీసుకుపోయారు. అక్కడి నుంచి బయలుదేరుతోంది. అలాగే భువనేశ్వర్‌ నుంచి విశాఖ మీదుగా మూడు రైళ్లు, హౌరా నుంచి మరో రెండు రైళ్లు నడుస్తున్నాయి. రోజుకు విశాఖ నుంచి సుమారుగా రెండు వేల మంది బెంగళూరుకు వెళుతున్నారు. ఈ డిమాండ్‌కు తగినట్టుగా రైళ్లు నడపాలి. కానీ ఒక్కటీ లేదు. కంటితుడుపు చర్యగా వారానికి ఒకసారి శనివారం స్పెషల్‌ రైలు నడిపి చేతులు దులుపుకుంటున్నారు. దీనిని కనీసం రెగ్యులర్‌ రైలుగా కూడా ప్రకటించకపోవడం గమనార్హం. కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ ప్రాంతం వారే. శ్రీకాకుళం నుంచి కూడా రోజుకు పది బస్సులు బెంగళూరు వెళుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడేలా రెండు హైస్పీడ్‌ రైళ్లు, వందేభారత్‌ (స్లీపర్‌) విశాఖ నుంచి నడిపితే ఎంతో ఆదరణ ఉంటుంది. ఆ దిశగా కేంద్రంపై ఉత్తరాంధ్ర ఎంపీలంతా ఒత్తిడి తీసుకురావాలి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. అంతా తలుచుకుంటే బెంగళూరుకు రైళ్లు వేయించలేరా? వీరంతా ఎప్పుడు స్పందిస్తారో మరి.

Updated Date - May 01 , 2026 | 02:09 AM