Share News

బస్సులు కిటకిట

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:58 PM

సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వచ్చిన వారంతా సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిటలాడింది. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

బస్సులు కిటకిట
మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సు

తిరుగు ప్రయాణాలతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ రద్దీ

అదనపు బస్సులు వేసినా ప్రయాణికులకు తప్పని అవస్థలు

కొందరు ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు..

పాడేరురూరల్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వచ్చిన వారంతా సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిటకిటలాడింది. ఏ బస్సు చూసినా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.

సంక్రాంతి సెలవులు ముగిసి సోమవారం నుంచి విద్యా సంస్థలు తెరుచుకోవడంతో మైదాన ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చారు. అలాగే వలస కూలీలు కూడా స్వగ్రామాల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌, ప్రైవేటు జీపుల స్టాండ్‌ రద్దీగా మారింది. ప్రయాణికుల రద్దీని ముందుగానే అంచనా వేసిన పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ పసగాడ శ్రీనివాసరావు సోమవారం విశాఖపట్నం, చోడవరం, అనకాపల్లి, కాకినాడ రూట్‌లలో ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. దీంతో మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగైంది.

డుంబ్రిగుడలో..

డుంబ్రిగుడ: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వచ్చిన విద్యార్థులు, వలస కూలీలు సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో మండలంలోని కించుమండ, డుంబ్రిగుడ, అరకు బస్‌ షెల్టర్ల వద్ద రద్దీ నెలకొంది. ఆర్టీసీ అధికారులు సోమవారం అదనపు బస్సులు ఏర్పాటు చేసినా రద్దీ కొనసాగింది. చాలా మంది ప్రైవేటు వాహనాల్లో తిరుగు ప్రయాణమయ్యారు.

సీలేరులో..

సీలేరు: సంక్రాంతి సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో సోమవారం ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు మైదాన ప్రాంతాలకు వెళ్లడానికి ఉదయం నుంచి వేచి ఉన్నా బస్సులు ఖాళీ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. గత్యంతరం లేక సీలేరు, ధారకొండ ప్రాంతాలకు చెందిన వారు జీకేవీధి, చింతపల్లి ప్రాంతాలకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయించారు.

Updated Date - Jan 19 , 2026 | 11:58 PM