Share News

హైవేపైనే బస్టాప్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:03 AM

మండల కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి బస్సులేవీ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం జాతీయ రహదారిపై చిన్నారులు, లగేజీతో నిరీక్షించాల్సి వస్తున్నది.

హైవేపైనే బస్టాప్‌
బస్సుల కోసం జాతీయ రహదారిపై వేచిఉన్న ప్రయాణికులు

బస్సుల కోసం రోడ్డుపై నిరీక్షణ

ఇబ్బంది పడుతున్న వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు

నిరుపయోగం ఆర్టీసీ కాంప్లెక్స్‌

పట్టించుకోని అధికారులు

నక్కపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి బస్సులేవీ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం జాతీయ రహదారిపై చిన్నారులు, లగేజీతో నిరీక్షించాల్సి వస్తున్నది.

నక్కపల్లిలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఆర్టీసీ కాంపెక్స్‌ నిర్మించారు. జాతీయ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించి, డివైడర్‌ ఏర్పాటు చేయడంతో ఎలమంచిలి వైపు నుంచి తుని వైపు వెళ్లే పాసింజర్‌, కొన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే కాంప్లెక్స్‌లోకి వచ్చేవి. తుని వైపు నుంచి ఎలమంచిలి వైపు వెళ్లే బస్సులు జాతీయ రహదారిపై నుంచి నేరుగా వెళ్లిపోతుండేవి. కాగా ఎలమంచిలి వైపు నుంచి వచ్చే బస్సులు సైతం క్రమేపీ కాంప్లెక్స్‌లోకి రాకుండా హైవే మీద నుంచే వెళ్లిపోతున్నాయి. సుమారు ఐదేళ్లు గడిచే సరికి ఒక్క బస్సు కూడా కాంప్లెక్స్‌లోకి రావడంలేదు. తుని వెళ్లే వైపు సర్వీసు రోడ్డు లేకపోవడం, హైవేను ఆనుకొని దుకాణాలు వుండడంతో ప్రయాణికులు జాతీయ రహదారిపై వేచి వుండాల్సి వస్తున్నది. వర్షం కురుస్తున్నప్పుడు తడుస్తూనే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత సమస్య మరింత పెరిగింది. బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు వేచిఉన్నచోట (కాంప్లెక్స్‌ హైవే జంక్షన్‌) కాకుండా కొంచెం దూరంగా ఆపుతున్నారు. ప్రయాణికులు ఉరుకులు పరుగులతో అక్కడకు వెళ్లేసరికి బస్సు కదిలిపోతున్నది. ఆర్టీసీ కాంప్లెక్సులోకి బస్సులు వస్తుంటే తమకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ స్థలం ప్రైవేటు వాహనాల పార్కింగ్‌గా మారిపోయింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి నక్కపల్లి కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలని, బస్సులన్నీ లోపలికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 01:03 AM