మండిన సండే!
ABN , Publish Date - May 24 , 2026 | 11:25 PM
మన్యంలో ఆదివారం ఎండ తీవ్రంగా కాసింది. ఈ ఏడాదిలో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానికి తీవ్రమైంది. దీంతో మధ్యాహ్నం బయట సంచరించలేని పరిస్థితి కొనసాగింది.
కొయ్యూరులో అత్యధికంగా 44.3 డిగ్రీలు
జిల్లాలో ముంచంగిపుట్టు, పెదబయలు మినహా ఎనిమిది మండలాల్లోనూ తీవ్రమైన ఎండ
పాడేరు, మే 24 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివారం ఎండ తీవ్రంగా కాసింది. ఈ ఏడాదిలో అత్యధికంగా గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై, మధ్యాహ్నానికి తీవ్రమైంది. దీంతో మధ్యాహ్నం బయట సంచరించలేని పరిస్థితి కొనసాగింది. రాత్రి, పగలు తేడా లేకుండా వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉంది. కొయ్యూరులో అత్యధికంగా 44.2 డిగ్రీలు, అరకులోయలో 42.4, పాడేరు, జీకేవీధి, జి.మాడుగుల, డుంబ్రిగుడలో 42.3, చింతపల్లిలో 40.0, అనంతగిరిలో 38.0, హుకుంపేటలో 37.0, ముంచంగిపుట్టులో 36.4, పెదబయలులో 35.9, డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీకేవీధి మండలంలో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో వారపు సంతకు వచ్చే వ్యాపారులు, గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. సీలేరు సంత మధ్యాహ్నం 12 గంటలకే జనం లేక బోసిపోయింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో పాటు ఉక్కపోతకు జనం అల్లాడిపోయారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండల పరిధిలో ఆదివారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. భానుడి ప్రతాపానికి భయపడి జనం బయటకు రావడానికి వెనుకంజ వేశారు. నిత్యం రద్దీగా ఉంటే నాలుగు రోడ్ల ప్రధాన జంక్షన్ కూడా జనసంచారం లేక వెలవెలబోయింది.