Share News

అంబటి దిష్టిబొమ్మల దహనం

ABN , Publish Date - Feb 01 , 2026 | 11:37 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచితంగా దుర్భాషలాడంపై కూటమి నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అరకులోయలో ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నాలుగు రోడ్ల జంక్షన్‌లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

అంబటి దిష్టిబొమ్మల దహనం
అరకులోయలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కూటమి నేతలు, కార్యకర్తలు

చంద్రబాబుపై బూతులు మాట్లాడడంపై

అరకులోయ, చింతపల్లిల్లో కూటమి శ్రేణుల నిరసన

అరకులోయ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచితంగా దుర్భాషలాడంపై కూటమి నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అరకులోయలో ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నాలుగు రోడ్ల జంక్షన్‌లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడుపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడంపై కూటమి నాయకులు తప్పుబట్టారు. అధికారం కోల్పోయి మతిభ్రమించి అంబటి రాంబాబు నోటికి వచ్చినట్టు వాగుతున్నాడని మండిపడ్డారు. ఇటువంటి బూతులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో జనసేన అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి చిరంజీవి, విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు, సాగర ఎంపీటీసీ సభ్యుడు వంతల దాసు, టీడీపీ మండల అధ్యక్షుడు లకొయ్‌ మహదేవ్‌, పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు శెట్టి బాబూరావు, జనసేన నాయకుడు సమర్డి రఘనాథ్‌, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు.

చింతపల్లిలో..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు అన్నారు. ఆదివారం చింతపల్లిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాంబాబుపై పోలీసు శాఖ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యదర్శి గెమ్మెలి రమణ, సీనియర్‌ నాయకులు రీమల పాల్‌, అర్జున్‌, లక్కోజు నాగభూషణం, మంగ్లు, గాంఽధీపడాల్‌ పాల్గొన్నారు.

దూషణలు ఖండనీయం

జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జీసీసీ రాష్ట్ర చైర్మన్‌ కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన పాడేరు క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలకు మద్దతిచ్చిన జగన్‌రెడ్డి, బొత్సల తీరును ఖండిస్తూ.. వారు ప్రజలకు తప్పుడు సందేశం ఇస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు చేసిన దూషణాత్మక వ్యాఖ్యలు ప్రజలు వినేందుకు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఇలాంటి భాష ఉపయోగించడం సమంజసం కాదన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి వైఖరినే వైసీపీ నాయకులు కొనసాగిస్తే ప్రజలు మరింత కఠినంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విలేకర్ల సమావేశంలో టీడీపీ నాయకులు బాకూరు వెంకటరమణరాజు, పాంగి పాండురంగస్వామి, సుబ్బారావు, వాసుదేవ్‌, త్రినాథ్‌, అచ్చిబాబు, మల్లేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 11:37 PM