మండుతున్న మన్యం
ABN , Publish Date - May 22 , 2026 | 12:04 AM
సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న మన్యం రాష్ట్రంలోనే అతి శీతల ప్రదేశం. ఇది ఒకప్పటి మాటగానే మిగిలిపోయేలా తాజా వాతావరణం ఏర్పడింది. గత రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలోని వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు మైదాన ప్రాంతానికి సమానంగా ఉండగా, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మాత్రం కాస్త తక్కువగానే ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే గత రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలోని పర్యావరణ పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మన్యంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. అతి శీతల ప్రాంతంగా ఉన్న మన్యం ఉష్ణమండలంగా మారడం గమనార్హం.
- నాడు శీతలం... నేడు అగ్నిగుండం
- రెండు దశాబ్దాల్లో ఎంతో మారిన ఏజెన్సీ వాతావరణం
- పర్యావరణ మార్పులతో మైదాన ప్రాంతానికి పోటీగా ఉష్ణోగ్రత
- ప్రస్తుతం 40 డిగ్రీలు దాటుతున్న వైనం
పాడేరు, మే 21 (ఆంధ్రజ్యోతి): సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న మన్యం రాష్ట్రంలోనే అతి శీతల ప్రదేశం. ఇది ఒకప్పటి మాటగానే మిగిలిపోయేలా తాజా వాతావరణం ఏర్పడింది. గత రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలోని వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు మైదాన ప్రాంతానికి సమానంగా ఉండగా, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు మాత్రం కాస్త తక్కువగానే ఉంటున్నాయి. మొత్తంగా చూస్తే గత రెండు దశాబ్దాలుగా ఏజెన్సీలోని పర్యావరణ పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మన్యంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. అతి శీతల ప్రాంతంగా ఉన్న మన్యం ఉష్ణమండలంగా మారడం గమనార్హం.
ఏజెన్సీ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలోనే అతి శీతల ప్రదేశంగా 1989లోనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాయి. అప్పట్లో ఏప్రిల్, మే నెలల్లోనే 13 డిగ్రీల కనిష్ఠ, 22 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితిని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ రెండు కాలాల్లోనూ నూర్యుడు దర్శనమివ్వని పరిస్థితి ఉండేదని అప్పుడు ఇక్కడ పని చేసిన అధికారులు, కేంద్ర కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రధానంగా అరకులోయ, పాడేరు ప్రాంతానికి సినిమా షూటింగ్‌లకు వచ్చిన సినీ ప్రముఖులు ఇక్కడ చల్లని వాతావరణం చూసి ఈ ప్రాంతాన్ని ‘ఆంధ్రా ఊటీ’గా అభివర్ణించారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇక్కడ చల్లని వాతావరణం ఉందనే ఆలోచనతోనే 1989లో కేంద్ర కాఫీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్తంగా ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. కొన్నాళ్లు కాఫీ తోటలకు నీడ నిచ్చే తోటలు అవసరం లేకుండానే కాఫీ గింజలను పండించేవారట. కానీ క్రమంగా చల్లదనం తగ్గడంతో ఆ తర్వాత కాఫీ తోటల్లో నీడనిచ్చేందుకు సిల్వర్‌ఓక్ చెట్లను నాటడం ప్రారంభించారని పూర్వపు కాఫీ రైతులు తెలిపారు.
ఏజెన్సీలో అంతరించిపోతున్న పచ్చదనం
రెండు దశాబ్దాలుగా చూస్తే ఏజెన్సీలోని పచ్చదనం చాలా వరకు హరించుకుపోయింది. గతంలో కొయ్యూరు మినహా ఏజెన్సీలోని పది మండలాలు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో అడవులు పుష్కలంగా ఉండేవి. అలాగే అన్ని ప్రాంతాల్లో అడవి జంతువులు జనానికి తారస పడుతుండేవి. అలాగే గిరిజనులపైనా అవి దాడులు చేస్తుండేవి. కానీ గత దశాబ్దకాలంగా పరిశీలిస్తే అడవి జంతులు మచ్చుకైనా లేవు. ప్రధానంగా గిరిజనులు అడవులను నాశనం చేసి పోడు వ్యవసాయం చేయడంతో కొండ ప్రాంతాలు ఖాళీ కాగా, విలువైన టేకు, రోజ్‌వుడ్, గండర, అకేషియా, పనస వంటి చెట్లను నరికి అటవీ శాఖ, స్మగ్లర్లు మరింతగా అడవులను ఖాళీ చేసేశారు. దీంతో అడవులు క్రమంగా తగ్గిపోయాయి. కాని అడవులు నరికేస్తున్నంతగా మొక్కలను నాటే ప్రక్రియ జరగడం లేదు. దీంతో పచ్చదనం క్రమేపీ క్షీణిస్తుందేగాని, ఒక్క శాతం కూడా వృద్ధి చెందలేదు. ఏజెన్సీలో గ్రామాలున్న ప్రదేశాల్లోనే మాత్రమే పనస, మామిడి చెట్లున్నాయేగాని, ఇతర ప్రాంతాల్లో వృక్షాలు లేని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ రెండు మండలాల్లో ఎటు చూసినా బోడి కొండలే దర్శనమిస్తున్నాయి. ఇతర మండలాల్లో భారీ వృక్షాలు లేనప్పటికీ, అక్కడక్కడ చెట్లున్నాయి. కానీ అవి అనుకున్నంతగా లేకపోవడంతో పర్యావరణ పరంగా మార్పులు ఏర్పడ్డాయి. దీంతో చల్లదనం క్రమంగా తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
పర్యావరణం పరంగా పూడ్చలేని నష్టం
గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఏజెన్సీ వాతావరణంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. ప్రధానంగా పర్యావరణ పరంగా ఎంతో తేడా కనిపిస్తున్నది. ఇది పూడ్చలేని నష్టమని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం హరిస్తున్నంత వేగంగా దానిని పునరుద్ధరించలేమని పేర్కొంటున్నారు. ఏజెన్సీకి పర్యావరణ పరంగా పూర్వ వైభవం తీసుకురావాలంటే మొక్కవోని దీక్షతో మొక్కలు నాటడం, పచ్చదనం పరిరక్షణకు 20 ఏళ్లు నిర్వరామంగా చర్యలు చేపడితేనే సాధ్యమవుతుందని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామంతో రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
హుద్‌హుద్ తరువాత పెరిగిన ఉష్ణోగ్రత
ఏజెన్సీలో సాధారణ అడవులు కంటే కాఫీతోటల కోసం వేసిన సిల్వర్‌ఓక్ మొక్కలే అధికంగా ఉంటాయి. కానీ 2014లో ఏర్పడిన హుద్‌హుద్ తుఫాన్‌తో ఏజెన్సీలోని కాఫీ తోటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. సుమారుగా 50 వేల ఎకరాల్లో సిల్వర్ ఓక్ చెట్లు హుద్‌హుద్‌కు నాశనమయ్యాయి. కానీ అటవీ శాఖ, కలప స్మగ్లర్ల పుణ్యమాని హుద్‌హుద్ పేరిట తుఫానులో కూలిన చెట్లు పేరిట 2014 నుంచి 2017 వరకు ఏజెన్సీలోని పచ్చదనాన్ని దోచేశారు. ఆఖరుకు ఈ సమస్య అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో కలప అక్రమాలను అడ్డుకట్ట వేయాలని అటవీ శాఖను సీరియస్‌గా ఆదేశించడంతో తాత్కాలికంగా కలప అక్రమాలు ఆగాయి. కాగా ఏజెన్సీలో 1989లో 22 డిగ్రీలు ఉన్న గరిష్ఠ ఉష్ణోగ్రత, 2002 వరకు అదే స్థాయిలో కొనసాగింది. ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టినా పెద్ద ప్రభావం చూపలేదు. 2002, 2003, 2004 వరకు వరకు ఏప్రిల్, మే నెలల్లో 14 డిగ్రీలు కనిష్ఠంగా, 23 డిగ్రీలు గరిష్ఠగా నమోదయ్యేవి. తరువాత 2004 నుంచి 2013 వరకు 18- 28గా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 2014 హుద్‌హుద్ తుఫాను తరువాత నుంచి ఉష్ణోగ్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. తాజా పరిణామాలు రానున్న రోజుల్లో ఏజెన్సీలోనూ మైదానానికి దీటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయనే సంకేతాలిస్తున్నాయి.
కొయ్యూరులో అత్యధికంగా 42.4 డిగ్రీలు
మన్యంలో గురువారం భానుడు తీవ్ర ప్రతాపం చూపించాడు. దీంతో ఏజెన్సీ వాసులు ఎండకు విలవిల్లాడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్రంగా కాయడంతో మధ్యాహ్నం జనం బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. కొయ్యూరులో 42.4, పాడేరు, జీకేవీధి, డుంబ్రిగుడలో 40.7, అరకులోయలో 40.2, చింతపల్లిలో 38.4, అనంతగిరిలో 37.2, జి.మాడుగులలో 36.4, హుకుంపేటలో 36.0, ముంచంగిపుట్టులో 35.5, పెదబయలులో 34.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.