Share News

ఓజోన్‌ వేలీలో బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:05 AM

విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ (బీఓఐ) కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనుంది.

ఓజోన్‌ వేలీలో బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌

ఆప్టికల్‌ కేరక్టర్‌ రికగ్నిషన్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు

పోర్టు, ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలు పర్యవేక్షణ

వీఎంఆర్‌డీఏ నుంచి రూ.27 కోట్లకు భూమి కొనుగోలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌ (బీఓఐ) కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దీని కోసం వీఎంఆర్‌డీఏ నుంచి ఓజోన్‌ వేలీ లేఅవుట్‌లో 9,132.26 చ.గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ భూమి ఖరీదు రూ.27.39 కోట్లు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో బీఓఐ పనిచేస్తుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలన్నీ బీఓఐ పరిధిలోకే వస్తాయి. విదేశాల నుంచి వచ్చే వారి వ్యవహారాలన్నీ వీరే చూస్తారు. అనుమతులు లేకుండా వచ్చేవారిని, గడువు తీరిన తరువాత ఇంకా ఇక్కడే కొనసాగే వారిని గుర్తించి, వెనక్కి పంపిస్తారు. సిబ్బంది కొరత, ఇతర కారణాల రీత్యా విమానాశ్రయాలు, పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో నడిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇవి సవ్యంగా నడవడం లేదని పలు సందర్భాల్లో నిరూపితమైంది. విదేశీయులు సరైన అనుమతులు లేకుండానే నగరాల్లో నివాసం ఉంటూ వివిధ వ్యవహారాల్లో పాల్గొంటున్నట్టు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బీఓఐని బలోపేతం చేయాలని నిర్ణయించింది. క్రమంగా పోర్టులు, విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్‌ పనులు రాష్ట్ర పోలీసులతో కాకుండా బీఓఐ సిబ్బందితోనే చేయించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఆ క్రమంలో విశాఖపట్నం పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలన్నీ ఇటీవలె ఒక్కొక్కటికి బీఓఐకి అప్పగిస్తున్నారు. త్వరలో విశాఖపట్నం విమానాశ్రయం వ్యవహారాలు కూడా చేతులు మారనున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి ఓజోన్‌ వేలీలో ‘ఆప్టికల్‌ కేరక్టర్‌ రికగ్నిషన్‌ (ఓసీఆర్‌) కాంప్లెక్స్‌’ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విదేశీయుల డాక్యుమెంట్లన్నీ సాంకేతికంగా విశ్లేషిస్తారు. డేటా భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. భూమికి సంబంధించి ఇంకా కొద్ది మొత్తం బీఓఐ చెల్లించాల్సి ఉందని, అది పూర్తయిన వెంటనే భూమిని అప్పగిస్తామని వీఎంఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 07 , 2026 | 01:05 AM