Share News

గతుకులు..అతుకులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:48 AM

జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రహదారుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. రోడ్లపై ఏర్పడిన గుంతలను పక్కాగా పూడ్చకుండా.. కంటి తుడుపుగా ప్యాచ్‌ వర్కులు చేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే రాళ్లు లేచిపోయి మళ్లీ గోతులు ఏర్పడుతున్నాయి.

గతుకులు..అతుకులు
సబ్బవరం మండలం అసకపల్లి నుంచి పరవాడ మండలం లంకెలపాలెం వెళ్లే రోడ్డులో ప్యాచ్‌ వర్కు చేస్తున్న దృశ్యం

ఆర్‌అండ్‌బీ రోడ్లపై మొక్కుబడిగా గోతులు పూడ్చివేత

కొద్దిపాటి వర్షానికే లేచిపోతున్న మెటల్‌

యథావిధిగా గోతులు ప్రత్యక్షం

తారు ధర పెరగడంతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టని కాంట్రాక్టర్లు

ప్యాచ్‌వర్కులతో సరిపెడుతున్న అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రహదారుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. రోడ్లపై ఏర్పడిన గుంతలను పక్కాగా పూడ్చకుండా.. కంటి తుడుపుగా ప్యాచ్‌ వర్కులు చేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే రాళ్లు లేచిపోయి మళ్లీ గోతులు ఏర్పడుతున్నాయి.రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నచోట కూడా అతుకులు అద్ది చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో అనకాపల్లి మండలంలోని తుమ్మపాల, మార్టూరు, బొజ్జన్నకొండ రహదారులపై గుంతలను ఆర్‌అండ్‌బీ అధికారులు హడావిడిగా పూడ్చివేశారు. తుమ్మపాల మెయిన్‌ రోడ్డుపైన, మార్టురు జంక్షన్‌లో భారీ గోతులు ఏర్పడినచోట తారు మిక్సింగ్‌ ప్లాంట్‌ వద్ద నుంచి వ్యర్థాన్ని తీసుకొచ్చి పూడ్చేశారు. కె.కోటపాడు రహదారిపై గుంతలకు ఇటీవల ప్యాచ్‌వర్కులు చేపట్టారు. లంకెలపాలెం నుంచి అసకపల్లి వరకు రోడ్డు పనులను కాంట్రాక్టరు చేపట్టకపోవడంతో గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. ఇవి తాత్కాలిక ఉపశమనాలేనని, కొద్దిపాటి వర్షానికే రాళ్లు లేచిపోయి గుంతలు బయటపడతాయని వాహనదారులు అంటున్నారు.

పనులపై తారు ధర ప్రభావం

పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, గల్ఫ్‌ దేశాల్లోని ఆయిల్‌ రిఫైనరీల నుంచి తారు దిగుమతి తగ్గిపోవడంతో తారు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను తారు రూ.45 వేలు వుంది. రహదారుల అభివృద్ధి పనుల కోసం అప్పటి ధరలకు అనుగుణంగా ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు అంతకన్నా ఒకింత తక్కువకు బిడ్లు దాఖలు చేశారు. టెండర్లను ఖరారు చేసి, పనులు ప్రారంభించే సమయానికి పశ్చిమాసియాలో భీకరంగా యుద్ధం జరుగుతున్నది. దీంతో తారు దిగుమతులు నిలిచిపోవడంతోపాటు తారు ధర ఏకంగా టన్ను రూ.90 వేలకు చేరింది. ఈ రేటుకు తారు కొనుగోలు చేసి రోడ్ల పనులు చేస్తే.. తాము అప్పుల పాలు కావాల్సిందేనంటూ కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలుకావడానికి చాలా ముందుగా రోడ్ల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం... తరువాత తారు ధరలు పెరగడంతో పనులు ఆపేయడం లేదా చాలా నెమ్మదిగా కొనసాగించడం చేస్తున్నారు.

గతంలో టెండర్లు పిలిచి ఖరారు చేసిన అచ్యుతాపురం- గాజువాక రోడ్డు పనులను కాంట్రాక్టర్‌ మొదలుపెట్టలేదు. భీమిలి- నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డులో బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద రహదారి మొత్తం ఛిద్రమైంది. అదే విధంగా చోడవరం పట్టణ పరిధిలో కూడా రోడ్డు దారుణంగా వుంది. రావికమతం- తట్టబంద రోడ్డులో దాసరిపాలెం వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రోలుగుంటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి కన్నూరుపాలెం మీదుగా నర్సీపట్నం వెళ్లే రోడుపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల వీటిని పూడ్చినప్పటికీ కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయాయి.

Updated Date - Aug 29 , 2026 | 12:48 AM