నిర్మించారు.. వదిలేశారు..
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:09 AM
స్థానిక బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు హాస్టల్ కోసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం ఎనిమిది నెలలైనా వినియోగంలోకి రాలేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు పాత భవనాల్లో, ఇరుకు వసతితో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
వినియోగంలోకిరాని గురుకుల పాఠశాల నూతన భవనం
నిత్యం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ప్రారంభం గురించి పట్టించుకోని అధికారులు
సీలేరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు హాస్టల్ కోసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం ఎనిమిది నెలలైనా వినియోగంలోకి రాలేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు పాత భవనాల్లో, ఇరుకు వసతితో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
సీలేరులోని బాలుర గురుకుల పాఠశాలలో 5వ నుంచి 10వ తరగతి 405 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తరగతుల నిర్వహణ, వసతి, భోజనం చేయడానికి గతంలో నిర్మించిన మూడు భవనాలు చాలకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో 2020వ సంవత్సరంలో మూడు అంతస్థుల భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. రెండు అంతస్థులకు శ్లాబ్ పనులు పూర్తయినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం బిల్లు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చే వరకు పనులు పునఃప్రారంభం కాలేదు. వైసీపీ హయాంలో చేసిన పనులకు కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. దీంతో కాంట్రాక్టర్ పనులు మళ్లీ మొదలుపెట్టారు. మొత్తం పనులు పూర్తిచేసి సుమారు ఎనిమిది నెలల క్రితం అధికారులకు అప్పగించేశారు. కానీ ఇంతవరకు భవనాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో విద్యార్థులు పాత భవనాల్లోని రెండు బ్లాకుల్లో తరగతులు, ఒక బ్లాకులో హాస్టల్ నిర్వహిస్తూ ఇబ్బందులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఆవరణలోనే నివాసాలు వుండాలి. కానీ ఇక్కడ నివాసాలు లేకపోవడంతో సీలేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్మించి, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్లలో నివాసం ఉంటున్నారు. పైగా పాఠశాలలో వున్న 30 మంది ఉపాధ్యాయులకు సరిపడ రేకుల షెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఒక్కో షెడ్డులో ఇద్దరు, ముగ్గురు టీచర్లు సర్దుకొని నివాసం వుంటున్నారు. అధికారులు స్పందించి నూతన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.