భవన నిర్మాణ విలువలూ పెంపు
ABN , Publish Date - Jan 28 , 2026 | 01:15 AM
రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువలతో పాటు నిర్మాణాల విలువ (కాంపోజిట్ రేట్)లు కూడా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. రోడ్లు, భవనాల శాఖ అధికారుల నుంచి సిమెంట్, ఇనుము ధరలు, వాటి వల్ల పెరిగిన నిర్మాణ వ్యయం లెక్కలు తీసుకొని వాటి ఆధారంగా కాంపోజిట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈసారి కూడా విజయవాడలోని ఆర్ అండ్ బి అధికారుల నుంచి లెక్కలు తీసుకొని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల వారీగా కాంపోజిట్ రేట్లను నిర్ణయిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి.
రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు
సిమెంట్, ఇనుము ధరలు, వాటి వల్ల
పెరిగిన నిర్మాణ వ్యయం ఆధారంగా
కాంపోజిట్ రేట్లు నిర్ణయం
భూ విలువలపై మధురవాడ కార్యాలయంలో డీఐజీ పరిశీలన
విశాఖపట్నం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి):
రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువలతో పాటు నిర్మాణాల విలువ (కాంపోజిట్ రేట్)లు కూడా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. రోడ్లు, భవనాల శాఖ అధికారుల నుంచి సిమెంట్, ఇనుము ధరలు, వాటి వల్ల పెరిగిన నిర్మాణ వ్యయం లెక్కలు తీసుకొని వాటి ఆధారంగా కాంపోజిట్ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈసారి కూడా విజయవాడలోని ఆర్ అండ్ బి అధికారుల నుంచి లెక్కలు తీసుకొని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీల వారీగా కాంపోజిట్ రేట్లను నిర్ణయిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం అపార్టుమెంట్లలో సెల్లార్, పార్కింగ్ ఏరియాలకు చ.అడుగుకు రూ.960 విలువ కడుతున్నారు. ఇకపై ఇది రూ.1,020 చొప్పున లెక్కిస్తారు. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లలో చ.అడుగు రూ.1,490 లెక్కిస్తున్నారు. దానిని రూ.1,580కి పెంచారు. గ్రౌండ్ ఫ్లోర్ రూ.1,800 ఉండగా రూ.1,900 చేశారు. మొదటి అంతస్థు నిర్మాణ ధర రూ.1,700 ఉండగా దానిని రూ.1,800 చేశారు. వ్యక్తిగత గృహాలు పది అడుగుల ఎత్తుకు పైన ఉంటే వాటి చ.అడుగు ధర రూ.1,590 నుంచి రూ.1,700 చేశారు. మూడో అంతస్థు నుంచి ప్రతి ఫ్లోర్‌కు రూ.30 పెంచారు. ఇవన్నీ ప్రాథమిక విలువలని, ఆ ప్రాంత భూముల ధరలను బట్టి కాంపోజిట్ రేట్లు మారతాయని రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు తెలిపారు.
మధురవాడలో డీఐజీ పరిశీలన
విశాఖపట్నం జిల్లాలో మార్కెట్ విలువలు మధురవాడ, భీమిలి, ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనే ఎక్కువగా పెరిగాయి. దాంతో రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాలకృష్ణ, ఆడిట్ అధికారి మన్మథరావు, సూపరింటెండెంట్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో మార్కెట్ విలువల పరిశీలన చేస్తున్నారు. గత రెండు రోజులు భీమిలి, ఆనందపురంలో పరిశీలన పూర్తిచేసిన అధికారులు మంగళవారం మధురవాడ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్‌తో కూర్చొని ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి ఎక్కువగా జరిగింది?, అక్కడి బహిరంగ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి?, అందుకు తగిన విధంగా విలువలు పెంచారా? లేదా? అనే అంశాలు పరిశీలించారు.
విలువల పెంపు అవసరం
అభివృద్ధి జరుగుతున్న ప్రాంతాల్లో భూముల విలువలు పెరగడం సహజం. దానికి అనుగుణంగా ప్రభుత్వ విలువలు లేకపోతే స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి విశ్వాసం ఉండదు. పూర్తిగా బహిరంగ మార్కెట్ విలువలతో సమానంగా పెంచకుండా రెండింటి మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. గజం రూ.70 వేలు బయట అమ్ముడుపోతుంటే అక్కడ ప్రభుత్వం ధర కనీసం 50 శాతానికి ఎక్కువ ఉండాలి. అందుకే అలాంటి చోట గజం రూ.40 వేలు చేస్తున్నాం.
- బాలకృష్ణ, డీఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ