బిల్డర్ల మాయ!
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:47 AM
బిల్డర్ల మాయాజాలంలో పడి మధ్య తరగతి ప్రజలు విలవిలలాడిపోతున్నారు.
సరైన నీటి వసతి లేకుండానే భారీ నిర్మాణాలు
కొనుగోలుదారులకు కష్టాలు
శివారు ప్రాంతాల్లో దారుణంగా పరిస్థితి
సమస్యను నిర్మాణదారుల దృష్టికి తీసుకువెళితే సంబంధం లేదని చేతులెత్తేస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
బిల్డర్ల మాయాజాలంలో పడి మధ్య తరగతి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. తగినన్ని భూగర్భ జలాలు లేకుండా, సరైన నీటి వసతి కల్పించకుండా బిల్డర్లు పదులు, వందల సంఖ్యలో ఫ్లాట్లను నిర్మించి, అమ్మేస్తున్నారు. వాటిలో నీటి సమస్య తలెత్తాక తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నా కష్టాలేనా?...అని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు.
ఎండాడ, మధురవాడ, పీఎం పాలెం, రుషికొండ, సాగర్‌నగర్ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వందలాది అపార్టుమెంట్లు నిర్మితమయ్యాయి. పది, ఇరవై ఫ్లాట్లు నిర్మించి అనుభవం సంపాదించినవారు గేటెడ్ కమ్యూనిటీ పేరుతో 50, అంతకు మించి ఫ్లాట్లతో పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేటపుడు అందులో నివాసితులందరికీ తగిన వసతులను బిల్డర్ కల్పిస్తున్నాడా?, లేదా? అనేది అధికారులు చూడడం లేదు. ఆ ప్రాంతంలో నీటి వనరులు ఉన్నాయా?, మురుగునీటి పారుదల సదుపాయం ఉందా?...అనేవి పరిశీలించడం లేదు. యాభై, అంతకు మించి ఫ్లాట్లు నిర్మిస్తే ఆయా కుటుంబాలకు నీటిని ఏ విధంగా సమకూరుస్తారు?...అనే ప్రశ్న కూడా వేయడం లేదు.
ఎండాడ, మధురవాడ, పీఎం పాలెం, రుషికొండ ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏటికేడు కిందికి పడిపోతున్నాయి. భూ ఉపరితలానికి 25 మీటర్లు కిందకు వెళ్లినా నీరు దొరకని పరిస్థితి ఉంది. బిల్డర్లు విచ్చలవిడిగా బోర్లు తవ్వడానికి వీల్లేదు. భూగర్భ జల వనరుల శాఖ, రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. అయినప్పటికీ అటువంటివేమీ లేకుండా కొందరు బిల్డర్లు ఒకే ప్రాంతంలో అనధికారికంగా పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. నగరంలో ప్రముఖ బిల్డర్లలో ఒకరు ఇటీవల బక్కన్నపాలెంలో చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టులో అనుమతి లేకుండా ఏకంగా 70కి పైగా బోర్లు తవ్వేశారు. దాంతో ఆ చుట్టుపక్కల బోర్లు ఎండిపోయాయి. దీనిపై జిల్లా యంత్రాంగం నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకుంది.
ఇక కొందరు బిల్డర్లు యాభై, అరవై ఫ్లాట్లతో గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించి వాటికి నామమాత్రంగా రెండు బోర్లు వేసి చేతులు దులుపుకుంటున్నారు. వాటిని కూడా 400 అడుగుల లోతుకు మించి వేయడం లేదు. కొనుగోలుదారులు ఎవరూ నీటి సమస్యపై దృష్టి పెట్టడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్ల ద్వారా నీరు రావడం లేదని చాలామంది గుర్తించడం లేదు. అందంగా బిల్డింగ్ డిజైన్ చేశారని, క్లబ్ హౌస్, సిమ్మింగ్‌పూల్, జిమ్, కమ్యూనిటీ హాలు వంటి సదుపాయాలు కల్పించారని మురిసిపోయి చదరపు అడుగు రూ.5 వేల నుంచి రూ.8 వేలు పెట్టి కొనేస్తున్నారు. నీటి సంగతి ఏమిటి? అని అడగడం లేదు. ఎవరైనా అడిగితే జీవీఎంసీ నుంచి వాటర్ సప్లయ్ ఉంటుందని నమ్మబలుకుతున్నారు.
100 ఫ్లాట్లు దాటితేనే బల్క్ వాటర్ కనెక్షన్
సిటీలో గల 20 లక్షల మంది జనాభాకు నీటిని సరఫరా చేసే సామర్థ్యం జీవీఎంసీకి కూడా లేదు. అపార్టుమెంట్ల విషయానికి వస్తే 100 లోపు ఫ్లాట్లు ఉన్నవారికి సెమీ బల్క్ కనెక్షన్ మాత్రమే ఇస్తున్నారు. ఇందులో రెండు ఇంచీల పైపులైన్ ద్వారా నీరు రోజుకు 45 నిమిషాల నుంచి గంటసేపు మాత్రమే ఇస్తున్నారు. ఇది గేటెడ్ కమ్యూనిటీల్లో తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతోంది. ఇతర రోజువారీ అవసరాలకు భూగర్భ జలాలు లేదంటే వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. 100 ఫ్లాట్లు దాటిన అపార్టుమెంట్లకు బల్క్ కనెక్షన్ ఇస్తున్నారు. దీనికి రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇలా సరఫరా చేసే నీటికి కిలోలీటరుకు రూ.90 చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చు, బిల్లు భరించగలిగిన వారే బల్క్ కనెక్షన్‌కు వెళుతున్నారు. ఈ ఖర్చు తగ్గించుకోవడానికి పలుకుబడి కలిగిన బిల్డర్లు అనధికారికంగా పదుల సంఖ్యలో బోర్లు వేసి, పరిసర ప్రాంతాల వారికి నీరు లేకుండా చేస్తున్నారు. ఎండాడ, మధురవాడ, రుషికొండల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి భారీ భవంతులే కారణమనేది జగమెరిగిన సత్యం.
చట్టం చేయాల్సిందే
పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, గాజువాక
ఎన్ని ఫ్లాట్లు నిర్మిస్తారో అన్నింటికీ తగిన నీటి వసతి కల్పిస్తామని బిల్డర్ గ్యారంటీ ఇవ్వడంతో పాటు దానికి తగిన ఆధారాలు చూపించినప్పుడు ఆయా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి. లేదంటే నిరాకరించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తాం. చట్టం చేయిస్తాం. గాజువాకలో కూడా ఈ సమస్య అధికంగా ఉంది.